TSPSC Paper leak: ప్రధాన నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన ఈడీ
ABN , First Publish Date - 2023-04-17T14:47:59+05:30 IST
తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు (TSPSC Paper Leakage Case)లో ప్రధాన నిందితులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు (TSPSC Paper Leakage Case)లో ప్రధాన నిందితులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో (Chanchalguda Jail) రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్ (Praveen), రాజశేఖర్‌ను మూడు గంటలుగా అధికారులు (ED Officers) ప్రశ్నిస్తున్నారు. రేణుక, లౌకిక్‌లతో పాటు మిగిలిన వారు ఇచ్చిన నగదు ఎక్కడికి మళ్లించారని అధికారులు ప్రశ్నించారు. అలాగే ప్రశ్నపత్రాలు లీకేజీ చేసి ఎంత మందికి అమ్మకానికి పెట్టారని ప్రశ్నలు సంధించారు. శంకర్‌లక్ష్మి విచారణలో చెప్పిన సమాచారం మేరకు రాజశేఖర్ ప్రశ్నపత్రాలు ఎవరెవరికి ఇచ్చాడు. నగదు లావాదేవీలు ఎలా జరిగాయన్న దానిపై అధికారాలు ఆరా తీస్తున్నారు. ఇక ప్రవీణ్, రాజశేఖర్ బ్యాంక్ ఖాతా వివరాలు వారి ముందే ఈడీ అధికారులు సేకరించారు.
నాంపల్లి కోర్టు అనుమతి మేరకు ఈడీ అధికారులు జైల్లో ప్రధాన నిందితులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నలుగురు సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం చంచల్‌గూడ జైల్లో ఉదయం 11 గంటల నుంచీ విచారిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ విచారణ జరుగనుంది. నిందితుల తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే జైల్లోకి ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్, మొబైల్స్‌ను కోర్టు అనుమతించింది. ఈడీ అధికారులకు వసతులు ఏర్పాటు చేయాలని జైలు సూపరింటెండెంట్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నలుగురు అధికారుల ఈడీ బృందం వెళ్లి విచారించడానికి న్యాయస్థానం అనుమతించింది. మనీ లాండరింగ్ కోణంలో ఇద్దరు నిందితులను ఈడీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈరోజు, రేపు చంచలగూడ జైల్లోనే ప్రధాన నిందితుల వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు.
ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలను రద్దు చేసింది. కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. మరోవైపు పేపర్ లీకేజీ కేసులో సిట్ కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది.