TS High Court: గ్రూప్ 1 రద్దుపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-09-23T17:20:04+05:30 IST
గ్రూప్ 1 రద్దుపై తెలంగాణ హైకోర్ట్(Telangana High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూప్ 1(Group 1) రద్దుకు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణమని హైకోర్టు తెలిపింది.
హైదరాబాద్: గ్రూప్ 1 రద్దుపై తెలంగాణ హైకోర్ట్(Telangana High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూప్ 1(Group 1) రద్దుకు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణమని హైకోర్టు తెలిపింది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన ప్రతి నిబంధనను తప్పకుండా పాటించాల్సిందిగా టీఎస్పీఎస్సీ(TSPSC)కి హైకోర్టు ఆదేశించింది. జూన్ 11వ తేదీన నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను గైడ్‌లైన్స్ ప్రకారం నిర్వహించలేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 పరీక్షను మరోసారి నిర్వహించి నోటిఫికేషన్‌లో ఇచ్చిన అన్ని నిబంధనలను తప్పకుండా పాటించాలని హైకోర్టు ఆదేశించింది. బయోమెట్రిక్‌తో పాటు నోటిఫికేషన్‌లో ఇచ్చిన అన్ని సూచనలను తప్పకుండా పాటించాలని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో టిఎస్సీఎస్సీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని హైకోర్ట్ చెప్పింది. అభ్యర్థుల డేటాను సేకరించడంలోనూ టీఎస్పీఎస్సీ విఫలమైంది. గ్రూప్ 1 పరీక్ష అభ్యర్థులకు ఎంత ప్రాముఖ్యమో తెలిసి కూడా టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వహించింది. టీఎస్పీఎస్సీ సమర్పించిన కౌంటర్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను సైతం టీఎస్పీఎస్సీ తప్పుగా చూపించిందని తెలిపింది. జూన్ 28వ తేదీన 23,3506 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని టీఎస్పీఎస్సీ వెబ్‌నోట్ ఇచ్చింది. కానీ కౌంటర్లో మాత్రం 23,3248 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు టీఎస్పీఎస్సీ తెలిపిందని హైకోర్ట్ మందలించింది.