Hyderabad: రద్దీగా ఉన్న నాంపల్లి రైల్వేస్టేషన్.. ఫ్లాట్ ఫాంపై పురిటి నొప్పులతో నిండు గర్భిణీ.. ఏమైందంటే?
ABN , First Publish Date - 2023-02-25T11:15:58+05:30 IST
అది నాంపల్లి రైల్వే స్టేషన్.. ఫ్లాట్ ఫాంపై నిండు గర్భిణీ. సొంతూరుకు వెళ్లేందుకు రైలుకోసం ఎదురు చూస్తోంది.. ఇంతలోనే పురిటి నొప్పులు.. విలవిలలాడుతోంది. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే మహిళా కానిస్టేబుల్ ఆ గర్భిణికి అన్నీ తానై పురుడు పోసింది.
మంగళ్‌హాట్, ఆంధ్రజ్యోతి: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ప్లాట్‌ఫామ్‌పైనే పురుడు పోసి తల్లీ బిడ్డను కాపాడారు నాంపల్లి రైల్వే పోలీసులు. వివరాలల్లోకి వెళితే.. యూపీలోని మహరాజ్‌గంజ్ భుస్పేర్ గ్రామానికి చెందిన అసబుద్దీన్ భార్య అసియా ఖుతున్(22) నిండు గర్భిణి. యూపీ నుంచి నగరంలోని బౌరంపేట్‌కు వలస వచ్చింది. ఆసియా భర్త వృత్తిరీత్యా పెయింటర్. ఆసియాకు నెలలు నిండడంతో శుక్రవారం ఆమెను సొంతూరైన బిలాస్ పూర్ తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు రైలుకోసం నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చారు.
అదే సమయంలో అసియాకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులకు ఏమి చేయాలో తెలియక ఆందోళనతో అక్కడున్న వారిని సహాయం కోసం కోరారు. అదే సమయంలో ప్లాట్‌ఫామ్ నెం.3లో చెకింగ్ నిర్వహిస్తున్న రైల్వే పోలీసులు వెంటనే అవసరమైన సామగ్రిని సమకూర్చారు. మహిళా కానిస్టేబుల్ కల్యాణి సకాలంలో స్పందించి ఆసియాకు పురుడుపోసింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వైద్య చికిత్సల నిమిత్తం రైల్వే ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ అంబులెన్స్‌ను రప్పించి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కాగా సకాలంలో స్పందించి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీసులను ప్రతి ఒక్కరూ అభినందించారు.