Hyderbad: అపురూపమైనదమ్మ..ఆడజన్మ: శానిటైజర్ పోసి నిప్పంటించినా...
ABN , First Publish Date - 2023-03-08T13:04:10+05:30 IST
భార్యాభర్తలిద్దరు గొడవపడ్డారు.మాటామాటా పెరిగింది. కారణాలు చిన్నవే అయినా ఇద్దరూ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త..భార్యపై శానిటైజర్ పోసి..
హైదరాబాద్: భార్యాభర్తలిద్దరు గొడవపడ్డారు.. మాటామాటా పెరిగింది. కారణాలు చిన్నవే అయినా ఇద్దరూ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త..భార్యపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు.15 రోజుల పాటు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నరకం అనుభవించింది. తన భర్త తప్పు చేసినా, నిప్పు పెట్టి నిలువునా కాల్చివేసినా.. తన చావు కంటే పిల్లలు అనాధలైన పోతారేమోనన్న బాధే అమెను దహించివేసినట్టుంది.. కట్టుకున్నవాడే శానిటైజర్ పోసి కాల్చివేసినా ప్రమాదవ శాత్తు జరిగిందని పోలీసులు మరణ వాంగ్మూలం ఇచ్చింది ఆ ఇల్లాలు.. చివరికి ప్రాణాలు విడిచింది. ఇదంతా కళ్లారా చూసిన పిల్లలు తల్లి మరణంతో తల్లడిల్లిపోయారు. తట్టుకోలేక బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్షణికావేశంలో భర్త ఆక్రోశానికి ఆ ఇల్లాలు బలైంది. ఆ కుటుంబం చిన్నాభిన్నం అయింది. ఎప్పుడూ వెన్నంటి ఉండే తల్లి దూరం కావడంతో ఆ ఇద్దరు పిల్లల హృదయవిదారక పరిస్థితి కంటతడి పెట్టిస్తోంది. మా అమ్మను మా నాన్నే శానిటైజర్ పోసి నిప్పంటి చంపేశాడు అని చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది.
సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మేడ్చల్ పట్టణంలోని సూర్యనగర్‌లో నరేందర్ భార్య నవ్యశ్రీ(33), ఇద్దరు పిల్లలు చందన, మేఘనతో కలిసి నివాసముంటున్నాడు. గతనెల 18వ తేదీన శివరాత్రి రోజు భార్య నవ్యశ్రీతో గొడవపడ్డాడు. పిల్లల ముందే ఇంట్లో ఉన్న శానిటైజర్ ఆమెపై పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన భార్యను ఓ ప్రైవేట్ ఆ స్పత్రిలో చికిత్స చేయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నవ్యశ్రీని కలిసి వాంగ్మూలం సేకరించగా దీపం ముట్టిస్తూ ప్రమాదానికి గురైనట్టు చెప్పింది. అనంతరం పరిస్థితి విషమించటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా సోమవారం మృతి చెందింది. తల్లి చావును తట్టుకోలేని పిల్లలు బంధువులతో కలిసి మంగళవారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రే శానిటైజర్ పోసి నిప్పంటించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నరేందర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.