Jagadish Reddy: తెలంగాణలో చంద్రబాబు వారుసుల నాయకత్వం.. రేవంత్‌పై జగదీష్ ఫైర్
ABN , First Publish Date - 2023-07-11T14:08:38+05:30 IST
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
హైదారాబాద్: రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రేవంత్‌పై మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy)మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) వారసుల నాయకత్వం ఇంకా తెలంగాణలో కొనసాగుతోందని వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రైతులకు శాశ్వత విముక్తి లభించిందని అందరూ అనుకున్నారని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రూపంలో తెలంగాణ రైతులకు నెత్తిన పిడుగు పడిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఉచిత కరెంట్ ఇస్తే నష్టం జరుగుతుందని చంద్రబాబు, ఆయన వారసులు చెప్పే మాటలు అని.. రైతులపై రేవంత్ తన నైజాన్ని బయట పెట్టారని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ (Congress) అని అన్నారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రేవంత్ ధర్నాలు చేశారని మంత్రి గుర్తుచేశారు.
24 గంటల విద్యుత్ రైతులకు ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. రైతులకు విద్యుత్ ఇస్తే మీకెందుకు ఏడుపు... కక్ష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు నుంచి రైతు వ్యతిరేక మాటలు ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. కాంగ్రెస్ జెండా పట్టుకున్న రైతులు ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. బషీర్‌బాగ్‌లో రైతులు చచ్చిపోయింది మూడు గంటల కరెంట్ కోసమా అని అడిగారు. తెలంగాణ రైతులు మళ్ళీ తూటాలకు బలి కావాలా అంటూ నిలదీశారు. రేవంత్ ఇంట్లో 24 గంటల కరెంట్ ఉండాలని... రైతులకు మాత్రం ఇవ్వొద్దా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమే రేవంత్ వ్యాఖ్యలు అంటూ విరుచుకుపడ్డారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన తప్పదని హెచ్చరించారు. ఎవరు ఎవరితో టచ్‌లో ఉన్నారో తమకు తెలియదని.. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.