Srinivas Goud: ఉచిత కరెంటుపై ఊరకుక్కలు ఎన్నిమొరిగినా పట్టించుకోం
ABN , First Publish Date - 2023-07-12T16:34:44+05:30 IST
దేశంలో 80 శాతం ప్రాంతాలు గుట్టలు, ఎడారిలానే తలపిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్: దేశంలో 80 శాతం ప్రాంతాలు గుట్టలు, ఎడారిలానే తలపిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణాలో మాత్రం అన్ని ప్రాంతాలు పచ్చదనంతో దర్శనమిస్తున్నాయన్నారు. గౌడ్లు బాగుపడుతున్నారన్న కుళ్లుతో దేవతలు తాగే అమృతం లాంటి కల్లును గత పాలకులు నిషేధించారని అన్నారు. గత ప్రభుత్వంలోని కొందరు పాలకులు గౌడ్లను అణచివేసే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అణచివేత ధోరణే తప్పా... విద్యకు, వైద్యానికి పెద్దపీట వెయ్యలేదని విమర్శించారు. వెయ్యి గురుకులాలు, ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని చెప్పుకొచ్చారు. అన్ని కులాలకు కోట్ల విలువ చేసే స్థలాలను కేటాయించి కమ్యుూనిటీ హాళ్లను నిర్మించి ప్రోత్సహించామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీసీ కులస్థుల ఎదుగుదలను చూసి గద్వాల జిల్లాలోని కొందరు ప్రజా ప్రతినిధులు ఓర్వలేక పోతున్నారన్నారు. ఉచిత కరెంటుపై ఊరకుక్కలు ఎన్నిమొరిగినా పట్టించుకోమన్నారు. పేదల అభివృద్ధిని అడ్డుకునే పార్టీలను పాతాళానికి తొక్కెయ్యాలన్నారు. నాడు కల్లును నిషేధించినోడు మనకు అన్నం పెడతామంటూ వచ్చి ఓట్లడుగుతారని.. వారిని నమ్మొద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.