Srinivas Goud: ఎన్నటికైనా న్యాయం, ధర్మమే గెలుస్తుంది

ABN , First Publish Date - 2023-10-10T14:21:16+05:30 IST

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Srinivas Goud: ఎన్నటికైనా న్యాయం, ధర్మమే గెలుస్తుంది

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు (Telangana Highcourt) కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై మంత్రి మాట్లాడుతూ..ఎన్నటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని ఈ తీర్పు ద్వారా వెల్లడైందన్నారు. జిల్లాను పరిపాలించిన ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు వారి అస్తిత్వం కనుమరుగవుతుందని కుట్ర చేసి బీసీల ద్వారానే బీసీ మంత్రి నైనా తనపై కేసు వేయించారన్నారు. ఎన్నికల్లో ప్రజల హృదయాలను గెలిచి ఓట్లు సాధించి విజయం కైవసం చేసుకోవాలని.. కానీ ఇలా అక్రమంగా కోర్టు కేసుల ద్వారా తప్పుడు మార్గంలో గెలుపు కోసం ప్రయత్నించడం దుర్మార్గమని మండిపడ్డారు. కనీసం తాగు, సాగు నీళ్లు ఇవ్వని వారిని ప్రజలు చీదరించుకున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో అన్ని సమస్యలు తీరాయన్నారు. మహబూబ్ నగర్ ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక పోతున్నారని మంత్రి మండిపడ్డారు.


ఒకప్పుడు వెనకబడిన మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఓర్వలేక ఆ ఇద్దరు ప్రధాన పార్టీలో ప్రతిపక్ష నేతలు కుట్రతో కేసు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు చెందిన తనలాంటి నేతలు ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకుంటే ఓర్వలేక కొందరు కేసుల పేరుతో దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారన్నారు. గత ఐదేళ్లుగా కేసుల పేరిట సోషల్ మీడియాలోనూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారన్నారు. జోగులాంబ అమ్మవారు, మన్యం కొండ స్వామి వాటి అశీస్సులు తమపై ఉన్నాయన్నారు. తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు ఎక్కువ రోజులు నిలబడవని తేటతెల్లం అయ్యిందని తెలిపారు. తనపై కుట్రలు చేసిన వారి పేర్లను ఆధారాలతో సహా వెల్లడిస్తానని... వారు తప్పనిసరిగా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. మానవీయ కోణంలో మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేస్తామని.. సీఎం కేసీఆర్ సహకారంతో జిల్లాను నెంబర్ వన్‌గా చేయడమే తమ లక్ష్యమని శ్రీనివాస్‌ గౌడ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-10T14:21:16+05:30 IST