TS News: ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌పై స్పందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ABN , First Publish Date - 2023-08-13T09:35:53+05:30 IST

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్‌ చేస్తామని చెప్పారు. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో అధికారి లైంగిక వేధింపులపై... ఉన్నతాధికారులతో పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించామన్నారు.

TS News: ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌పై స్పందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ (Minister Goud) స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్‌ (Suspended) చేస్తామని చెప్పారు. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ (Hakimpet Sports School)లో అధికారి లైంగిక వేధింపులపై... ఉన్నతాధికారులతో పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించామన్నారు. మహిళల పట్ల వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు.

కవిత ట్వీట్..

ఆంధ్రజ్యోతి (Andhrajyothy) కథనంపై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ (Tweet) చేశారు. ‘‘కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వంలో...ఇలాంటి వాటికి తావు ఉండకూడదు.. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న.. అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలి.. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి.. బాధితురాళ్లకు న్యాయం చేయాలంటూ’’.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కవిత కోరారు. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో... అధికారి లైంగిక వేధింపులపై ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది.

పూర్తి వివరాలు..

తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై ఢిల్లీ కేంద్రంగా మహిళా రెజర్లు జరిపిన ఆందోళనను మరువకముందే.. తెలంగాణలో మరో బ్రిజ్‌ భూషణ్‌ తేలాడు! నిబంధనల ప్రకారం బాలికల హాస్టల్లో పురుష అధికారులు తిష్ఠవేయకూడదు. అత్యవసరంగా అర్ధరాత్రి పూట వెళ్లాల్సి వచ్చినా మహిళా అధికారులు, మహిళా వార్డెన్ల నుంచి అనుమతి పొంది, వెళ్లి వెంటనే వచ్చేయాలి! అధికారులు ఏ విద్యార్థినైనా బయటకు తీసుకెళ్లాల్సి వస్తే తోడుగా మహిళా వార్డెన్‌ తప్పనిసరిగా ఉండాలి. సదరు అధికారి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా బాలికల హాస్టల్లోని గెస్ట్‌ రూంలోనే మకాం పెట్టాడు. తమ పట్ల సదరు అధికారి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారంటూ హాస్టల్లోని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. ఆ అధికారి బలవంతపెట్టడంతో అతడితో కలిసి బయటకు వెళుతున్న విద్యార్థులు, హాస్టల్‌కు వచ్చాక, అతడు తమ పట్ల చేసిన దుశ్చేష్టలను మహిళా ఉద్యోగులకు చెప్పుకొని భోరుమంటున్నారు. కాగా స్పోర్ట్స్‌ స్కూల్‌లో తన గదికి ఎదురుగా ఉండే గదిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో సదరు అధికారి రాసనీలలు నడుపుతున్నాడని, విద్యార్థినుల పట్ల ఆయన పాల్పడుతున్న ఆగడాలకు ఆమె, మరో ఇద్దరు సీనియర్‌ కోచ్‌లు సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రోజూ సదరు అధికారి కాళ్లు మొక్కాలంటూ విద్యార్థులను ఆ సీనియర్‌ కోచ్‌లు వేధిస్తున్నట్లు సమాచారం. కొన్నాళ్ల క్రితం ఓ బాలిక ఒకరోజు కొన్ని గంటల పాటు పాఠశాల ప్రాంగణంలో కనిపించలేదు. ఆందోళన చెందిన అధికారులు పాఠశాల ప్రాంగణంలో వెతికారు. కాసేపటికి ఆ బాలిక.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి గదికి ఎదురుగా ఉన్న మహిళా ఉద్యోగి గదిలో కనిపించింది. గుర్తించిన మిగతా అధికారులు మాట్లాడేందుకు వెళ్లగా.. ఆ బాలిక లోదుస్తుల్లో కనిపించడంతో నివ్వెరపోయారు. తర్వాత కొద్ది రోజులకే ఆమె అనారోగ్యం పాలైందని, నెలసరి విషయంలోనూ సమస్యలు తలెత్తాయని సమాచారం. కాగా సదరు మహిళా ఉద్యోగి వినియోగించే జడ పిన్నులు, హెయిర్‌ బ్యాండ్లు ఈ అధికారి గదిలో కనిపించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ విషయం స్వీపర్ల ద్వారా బయటకు పొక్కుతుందని గమనించిన ఆయన, వారిని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. ప్రాంగణంలో అధికారులు, సిబ్బంది తన గురించే చర్చించుకుంటున్నారన్న అనుమానంతో మహిళా ఉద్యోగులనూ హెచ్చరించారని, వారిని మానసికంగా వేఽధింపులకు గురిచేస్తున్నాడని తెలిసింది.

ఓ మంత్రిగారి అండదండలు

ఇప్పటికే వివిధ క్రీడల్లో మంచి ప్రతిభ కలిగి, పతకాలూ సాధించి ఉండటం, భవిష్యత్తులో పాల్గొనాల్సిన క్రీడలకు సంబంధించిన శిక్షణ నడుస్తుండటంతో సదరు అధికారి పాల్పడుతున్న లైంగిక వేధింపులను బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు. అధికారి దుశ్చేష్టలపై స్పోర్ట్స్‌ అఽథారిటీకి చెందిన ఉన్నతాధికారులకు ఇప్పటికే ఫిర్యాదు వెళ్లింది. కాగా సదరు అధికారికి ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉండటం, ఉద్యోగుల సంఘంలోనూ ఆయన కీలకంగా ఉండటంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతున్నట్లు సమాచారం.

Updated Date - 2023-08-13T09:40:32+05:30 IST