MLC Kavitha: ఈడీ బెదిరిస్తోంది

ABN , First Publish Date - 2023-03-16T03:54:33+05:30 IST

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

MLC Kavitha: ఈడీ బెదిరిస్తోంది

తప్పుడు వాంగ్మూలం కోసం ఒత్తిడి చేస్తున్నారు

దర్యాప్తులో థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారు.. బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వండి

నోటీసులను రద్దు చేయండి.. స్టే విధించండి.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్‌

స్టే విధింపునకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. ఈ నెల 24న విచారణ చేపడతామని వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. తీవ్రమైన బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న చందన్‌రెడ్డిని క్రూరంగా కొట్టారని, దాంతో ఆయన వినికిడి శక్తి కోల్పోయారని పేర్కొన్నారు. దీనిపై చందన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని, ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని వివరించారు.

తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా సాక్షులను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని, కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తామంటూ భయపెడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని అధికార పార్టీ ఇష్టం ప్రకారం ఈడీ తనకు వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని, తనకు ఈడీ జారీ చేసిన నోటీసులపై స్టే విధించడమేకాకుండా వాటిని రద్దు చేయాలని సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలొని ధర్మాసనం ఎదుట న్యాయవాదులు ప్రస్తావించారు. అయితే తక్షణమే స్టే విధించడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ చేపడతామని తెలిపింది.

ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయినా..

ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని పిటిషన్‌లో కవిత పేర్కొన్నా రు. అయినా.. కేంద్రంలోని అధికార పార్టీ నేతలు ఆ ఎఫ్‌ఐఆర్‌తో తనను లింక్‌ చేసి తప్పుడు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. గతఏడాది నవంబరు30న ఒక రిమాండ్‌ అప్లికేషన్‌లో ఈడీ తన వ్యక్తిగత వివరాలను పొందుపరిచిందని తెలిపారు. ‘‘నాకు వ్యతిరేకంగా విస్తృత కుట్రలో భాగంగా కేంద్రంలోని అధికార పార్టీ చెప్పినట్లుగా ఈడీ వ్యవహరిస్తోంది. రిమాండ్‌ అప్లికేషన్‌ ద్వారా నా వ్యక్తిగత కాంటాక్ట్‌ వివరాలు ప్రజలకు, మీడియాకు లీక్‌ అ య్యాయి. సామాజిక మాధ్యమాల్లోనూ షేర్‌ అయ్యాయి. ఇలాంటి చర్య అక్రమం’’ అని కవిత పేర్కొన్నారు.

తనపై కేసు లేదని, కేవలం కొంత మంది వ్యక్తులు తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా తనను ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఆ వాంగ్మూలాలను కూడా వారిని బెదిరించి బలవంతంగా తీసుకున్నారని, అరుణ్‌ రామచంద్ర పిళ్లై తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ‘‘రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలి. నేను వాస్తవాలు చెప్పడానికి, స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇవ్వడానికి, దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు.

నా ఫోన్‌ స్వాధీనం అక్రమం..

ఈ నెల 11న తన ఫోన్‌ను ఈడీ అధికారులు అక్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని కవిత తెలిపారు. ‘‘నాకు పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 50(2), 50 (3) ప్రకారం ఈడీ నోటీసులు జారీ చేసింది. కేవలం వ్యక్తిగత హాజరు కోసమే సమన్లు పంపించింది. వ్యక్తిగతంగా హాజరైన సమయంలో ఫోన్‌ను సమర్పించాలని వాటిలో ప్రస్తావించలేదు. అయినప్పటికీ నేను విచారణకు హాజరైన సమయంలో అక్రమ పద్ధతిలో నా ఫోన్‌ను తక్షణమే సమర్పించాలని ఈడీ అధికారులు ఆదేశించారు. ఇలా బలవంతపెట్టడం పట్ల షాక్‌ అయినప్పటికీ ఫోన్‌ అందించాను. నా ఫోన్‌ సీజ్‌ చేయడానికి గల కారణాలను కూడా చెప్పలేదు. పైగా సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా దాదాపు రాత్రి 8.30 గంటల వరకు విచారించారు’’ అని కవిత వివరించారు.

వ్యక్తిగతంగా హాజరుకావాలని పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 50 ప్రకారం జారీ చేసిన నోటీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160కి విరుద్ధంగా ఉన్నాయని, ఈ మేరకు ఈ నెల 7న, 11న జారీ చేసిన సమన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో తీసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. తన ఫోన్‌ స్వాధీ నం చేసుకొని జారీచేసిన జప్తు నోటీసులను రద్దు చేయడంతో పాటు ఫోన్‌ సీజ్‌ చేయడం చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను నళినీ చిదంబరం వర్సెస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసుకు జత చేయాల్సిందిగా కోరారు. తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులివ్వాలని ఆమె అభ్యర్థించారు.

Updated Date - 2023-03-16T03:54:33+05:30 IST