Share News

MP Komatireddy: కేసీఆర్ కంటే 4 సీట్లు ఎక్కువే ఇస్తున్నాం

ABN , First Publish Date - 2023-10-15T13:04:51+05:30 IST

55 సీట్లలో బీసీలకు 12, జనరల్ 26, మైనారిటీలకు 3 సీట్లు ఉన్నాయని, బీసీలకు 12 సీట్లు వచ్చాయని, తర్వాత జాబితాలో కూడా వస్తాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కంటే 4 సీట్లు ఎక్కువే ఇస్తున్నామని అన్నారు. టికెట్స్ రానివారు నిరాశ చెందవద్దని కోరారు.

MP Komatireddy: కేసీఆర్ కంటే 4 సీట్లు ఎక్కువే ఇస్తున్నాం

న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) ఆదివారం విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థుల లిస్టును పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) పేరుతో రిలీజ్ (Release) చేసింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komatireddy Venkata Reddy) మీడియాతో మాట్లాడుతూ 55 సీట్లలో బీసీలకు 12, జనరల్ 26, మైనారిటీలకు 3 సీట్లు ఉన్నాయన్నారు. బీసీలకు 12 సీట్లు వచ్చాయని, తర్వాత జాబితాలో కూడా వస్తాయన్నారు. కేసీఆర్ (KCR) కంటే 4 సీట్లు ఎక్కువే ఇస్తున్నామని తెలిపారు. టికెట్స్ రానివారు నిరాశ చెందవద్దని కోరుతున్నానని, అందరి ఉమ్మడి లక్ష్యం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమేనని, అందుకోసం అందరూ పనిచేయాలని ఆయన పిలుపిచ్చారు.

ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా సరే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. డీఎస్సీ నియామకాలు లేవని, అందుకే స్కూళ్లకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ సరిగా అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రవల్లిక అనే అమ్మాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం ప్రిపేర్ అయి, పరీక్షలు రద్దు కావడం వల్ల ఆత్మహత్య చేసుకుందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే ముందు నోటిఫికేషన్లు ఇస్తారని, కోడ్ కారణంగా బంద్ అవుతుందని, కావాలనే ఇలా చేస్తారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

టిక్కెట్లు దక్కనివారికి ఇతర పదవులు వస్తాయని, వారిని అధిష్టానం పెద్దల వరకు తీసుకొచ్చి కలిపిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ, ఎంపీ, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇలా చాలా పదవులు ఉన్నాయన్నారు. టికెట్ రానివాళ్లూ వచ్చినవారితో కలిసి పనిచేయాలని సూచించారు. వచ్చే లిస్ట్‌లో కూడా సామాజిక సమీకరణాలు చూసి టిక్కెట్లు ఇస్తామన్నారు. కష్టపడి జెండాలు మోసిన అందరికీ పదవులు దక్కుతాయన్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు కారణంగా మాకు నష్టమేనని, మిర్యాలగూడ అడుగుతున్నారని, అది కాంగ్రెస్ గెలిచే సీటని, మునుగోడు సీటు తీసుకోమంటే కొత్తగూడెం కావాలంటున్నారన్నారు. జాతీయస్థాయిలో ప్రయోజనాలు చూసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుందని, దాన్ని అందరం గౌరవించాలన్నారు.

పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) పార్టీ మారడం బాధాకరమని, కానీ ఆయన టికెట్స్ అమ్ముకుంటున్నారని నిందలు వేయడం సరికాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. డాలర్ లక్ష్మయ్య అని పేరుందని, గుర్తింపు వచ్చింది కాంగ్రెస్ పార్టీతోనని, నీడను ఇచ్చే చెట్టును నరుక్కుంటారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు టికెట్ రాకపోతే రేపు రాజ్యసభ సీటు వచ్చేదేమోనని అన్నారు. టికెట్స్ ఇచ్చేది హై కమాండ్ అని, దానికి రాష్ట్ర నాయకత్వాన్ని తిట్టడం సరికాదన్నారు. టీపీసీసీ చీఫ్‌ను తిడితే హై కమాండ్‌ను తిట్టినట్టేనని.. పీసీసీ చీఫ్ కోఆర్డినేటర్ మాత్రమేనని, ఆయన్ను అంటే ఏమొస్తుందన్నారు. షర్మిల చేరిక విషయంలో నో కామెంట్ అని, వచ్చి ఉంటే బాగుండేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

70 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పొన్నాల వంటి నేతలు ఉన్నా, లేకున్నా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. కరోనా సమయంలో ఆయన నియోజకవర్గానికి తాను వెళ్లి ప్రజలకు సాయం చేశానన్నారు. నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా ఇప్పుడొచ్చి టికెట్ అంటే వస్తుందా? అని ప్రశ్నించారు. ఆలేరు టికెట్ బీసీకి ఇచ్చామని... భువనగిరి టికెట్ కూడా బీసీకి ఇవ్వాలని చెప్పానని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-15T13:04:51+05:30 IST