CM KCR : ఇక్కడ వీళ్లను అర్సుకోవడానికి టైం లేదు కానీ.. అంటూ కేసీఆర్‌పై విమర్శల వెల్లువ

ABN , First Publish Date - 2023-08-01T10:11:46+05:30 IST

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తపిస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. అప్పటి నుంచి పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించడంపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా మహారాష్ట్రపై మరింత ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మహారాష్ట్రలో మాత్రం జాయినింగ్స్ పేరిట కేసీఆర్ హడావిడి చేశారు.

CM KCR : ఇక్కడ వీళ్లను అర్సుకోవడానికి టైం లేదు కానీ.. అంటూ కేసీఆర్‌పై విమర్శల వెల్లువ

హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తపిస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. అప్పటి నుంచి పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించడంపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా మహారాష్ట్రపై మరింత ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మహారాష్ట్రలో మాత్రం జాయినింగ్స్ పేరిట కేసీఆర్ హడావిడి చేశారు. ఇప్పటికే అక్కడ పలు చేరికల సభలు నిర్వహించారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పార్టీ తరుఫున అభ్యర్థులను నిలబెట్టారు. వారిలో ఏ ఒక్కరూ విజయం సాధించలేదనుకోండి అది వేరే విషయం. ఇక మరోసారి నేడు ఆయన మహారాష్ట్రలో పర్యటించనున్నారు.

పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కడ తిరిగినా ఏమీ లేదు కానీ తెలంగాణలో పరిస్థితులు సరిగా లేనపుడు పక్క రాష్ట్రాల పర్యటనలంటే ప్రజల నుంచి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతాయి. ప్రస్తుతం ఇదే జరుగుతోంది. తెలంగాణలో బీభత్సంగా వర్షాలు కురిసి అతలాకుతలం అయిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి అయితే నామరూపాల్లేకుండా పోయింది. ఇక ఇటు ములుగు జిల్లాలోని కొండాయి గ్రామం పరిస్థితి కూడా దాదాపు అంతే. ఇలా చాలా ప్రాంతాలున్నాయి. కానీ ఏ ఒక్కచోటకూ సీఎం కేసీఆర్ వెళ్లింది లేదు. ఏ ఒక్కరినీ పకలరించిన పాపాన పోలేదు. కానీ ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనకు మాత్రం వెళుతున్నారు. దీంతో నెట్టింట పెద్ద ఎత్తున కేసీఆర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఇక్కడ జరిగిన వరదల్లో ప్రజలు కష్టాలు పడుతుంటే వీళ్ళను అర్సుకోడానికి సారుకు టైం దొరకలేదు కానీ మహారాష్ట్రకు పోయి అక్కడ రాజకీయాలు చేస్తుండు ఇలాంటి నాయకులను ఏమనాలి? భూపాలపల్లి ములుగు జిల్లాల్లో ప్రజలు అరిగోస పడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు చెయ్యాలా సహాయం? ప్రభుత్వం చెయ్యదా?’’ అని ట్విటర్ వేదికగా మండిపడుతున్నారు.

మహారాష్ట్ర కొల్హాపూర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌ మంగళవారం బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు నెక్లెస్‌ రోడ్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అంబులెన్సు వాహనాలను కేసీఆర్‌ జెండా ఊపి ప్రారంభిస్తారు. వీటిలో 108 అంబులెన్సులు 204, 102 అమ్మ ఒడి వాహనాలు 228, హియర్స్‌ వాహనాలు 34... మొత్తం 466 వాహనాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం సీఎం కొల్హాపూర్‌ బయలుదేరి వెళ్తారు. అక్కడి మహాలక్ష్మిఅంబా దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తారు. వాటే గావ్‌లో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. మహారాష్ట్ర పర్యటన ముగించుకొని సీఎం సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకుంటారు.

Updated Date - 2023-08-01T10:34:11+05:30 IST