T.Highcourt: కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు.. టి. హైకోర్టు సంచలన తీర్పు
ABN , First Publish Date - 2023-07-25T12:14:26+05:30 IST
కొత్తగూడెం ఎమ్మెల్యే అఫిడవిట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. దీంతో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది.
హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యే అఫిడవిట్ కేసులో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పును వెల్లడించింది. కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (BRS MLA Vanama Venkateshwar Rao) ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. దీంతో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును (Jalagam Venkatrao) కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది. జలగం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ నేత కావడం గమనార్హం.
2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. అనంతరం బీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. బీఆర్ఎస్ తరపున జలగం వెంకట్రావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర రావు గెలుపును సవాల్ చేస్తూ జలగం వెంకట్రావు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు నివేదిక సమర్పించారని జలగం ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ అనంతరం వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. సమీప అభ్యర్ధిగా జలగం వెంకట్రావును కోర్టు విజేతగా ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు గాను వనమాకు రూ .5 లక్షల జరిమానా విధించడంతో పాటు 2018 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా అర్హుడు కాదంటూ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది.