MLA Rajsingh: ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్
ABN , First Publish Date - 2023-02-28T17:28:17+05:30 IST
తనపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) సంచలన కామెంట్స్ చేశారు.
హైదరాబాద్: తనపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) సంచలన కామెంట్స్ చేశారు. ఇతర పార్టీ లేదా ఇండిపెండెంట్‌గా పోటీచేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. బీజేపీ (BJP) నాయకత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (Bandi Sanjay) తనకు శ్రీరామరక్ష అన్నారు. సస్పెన్షన్ అంశాన్ని బండి సంజయ్ చూసుకుంటారనే నమ్మకం వ్యక్తం చేశారు. తన ప్రవర్తన వలన బీజేపీకి నష్టం కలగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళే ఆలోచన లేదని, ధర్మం కోసం పనిచేస్తానన్నారు.
హైదరాబాదులో గతేడాది ఆగస్టు నెలలో జరిగిన స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫరూఖీ షోని రాజాసింగ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే భారీ బందోబస్తు మధ్య అప్పట్లో ఆ కార్యక్రమం నిర్వహించడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో ఆందోళనలకు దారితీయడం, కేసు నమోదు, అరెస్ట్ తదితర పరిణామాలు చకచకా చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఆయనను సస్పెండ్ చేస్తూ బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక తనకు వస్తున్న బెదిరింపు కాల్స్‌పై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తున్నానని రాజాసింగ్ తెలిపారు. బెదిరింపు కాల్స్‌పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదన్నారు. ఇంటిలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చిందని పేర్కొన్నారు. ఇప్పుడిచ్చిన వాహనమైనా మంచిగా పనిచేస్తోందని భావిస్తున్నానని నమ్మకం వ్యక్తం చేశారు.
రాజాసింగ్కు ప్రభుత్వం గతంలో ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తుండటంతో ఆయన పలుమార్లు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి, డీజీపీ దృష్టికి తెచ్చారు. అయినా స్పందన లేకపోవడంతో ఇటీవలే పాత వాహనాన్ని ప్రగతి భవన్ వద్ద వదిలి పెట్టి వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చింది. 2017 మోడల్ ఫార్చ్యూనర్ కారును రాజసింగ్ ఇంటికి పంపింది.