TSRTC Merger Bill : ఆర్టీసీ కార్మికుల ఆందోళన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం..!
ABN , First Publish Date - 2023-08-05T11:35:37+05:30 IST
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్చలకు రాజ్‌భవన్‌కు రావాలంటూ ఆర్టీసీ యూనియన్ నేతలకు గవర్నర్ ఆహ్వానం పంపారు. మరికాసేపట్లో ఆర్టీసీ ముఖ్య నాయకులతో తమిళిసై సమావేశం కానున్నారు. వీలుకాని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ చర్చించనున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్చలకు రాజ్‌భవన్‌కు రావాలంటూ ఆర్టీసీ యూనియన్ నేతలకు గవర్నర్ ఆహ్వానం పంపారు. మరికాసేపట్లో ఆర్టీసీ ముఖ్య నాయకులతో తమిళిసై సమావేశం కానున్నారు. వీలుకాని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ చర్చించనున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఆ బిల్లును గవర్నర్ దగ్గరకు పంపించారు. బిల్లును పరిశీలించిన తమిళిసై న్యాయపరమైన అభ్యంతరాలు ఉన్నాయంటూ సీఎస్‌కు లేఖ రాశారు. వీటిపై సమాధానం ఇవ్వాలంటూ ఐదు అభ్యంతరాలతో కూడిన లేఖను ప్రభుత్వానికి పంపించారు. బిల్లును గవర్నర్ ఆమోదించకుండా అసెంబ్లీలో పాస్ చేయడానికి వీలు లేకుండా పోయింది. మరోవైపు ఆదివారం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కూడా ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులంతా శనివారం ఉదయాన్నే రోడ్డెక్కారు. రెండు గంటల పాటు ఆందోళనలు చేపడుతున్నట్లు ప్రకటించారు. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. కానీ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు విరమించలేదు.. అటు నుంచి అటే రాజ్‌భవన్ ముట్టడికి బయల్దేరారు. ఆర్టీసీ విలీన బిల్లు ఆమోదించాలంటూ ముట్టడికి బయల్దేరారు. మరోవైపు చర్చలకు రావాలంటూ యూనియన్ నేతలను గవర్నర్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఏం చర్చిస్తారన్న దానిపై ఉత్కంఠ సాగుతోంది.