TSRTC Merger bill: ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ కోరిన ఐదు అంశాలు ఇవే...

ABN , First Publish Date - 2023-08-05T10:55:53+05:30 IST

తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ పోటోకు పాలాభిషేకాలు కూడా చేశారు.

TSRTC Merger bill: ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ కోరిన ఐదు అంశాలు ఇవే...

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో (Telangana Government) ఆర్టీసీ విలీన బిల్లు (TSRTC Merger bill) గవర్నర్ (Governor Tamilisai) దగ్గర పెండింగ్‌లో ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి కేసీఆర్ (CM KCR) కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ పోటోకు పాలాభిషేకాలు కూడా చేశారు. కేబినెట్ ఆమోదంతో ఆర్టీసీ బిల్లును తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతకు ముందే ఈ బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు (Rajbhavan) పంపారు. అయితే ఈ బిల్లుకు సంబంధించిన పలు అంశాలపై వివరణ కోరుతూ గవర్నర్‌ బిల్లును పెండింగ్‌లో పెట్టడం సంచలనంగా మారింది. ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయం శనివారం నాడు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆర్టీసీ విలీన బిల్లుకు సంబంధించి మొత్తం ఐదు అంశాలపై ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరారు.


ఆ ఐదు అంశాలు ఏంటంటే...

1. 1958 నుండి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్‌లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు.

2. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు.

3. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం... వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి అని ప్రశ్నించిన గవర్నర్.

4. విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్.

5. ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్.

ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్ ప్రయోజనాలపై మరిన్ని స్పష్టమైన హామీలను గవర్నర్ కోరారు. మరి ఈ ఐదు అంశాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.


ఆర్టీసీ బంద్...

మరోవైపు ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్‌ ఆమోదం తెలుపకపోవడంతో టీఎస్ఆర్టీసీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈరోజు (శనివారం) ఉదయం రెండు గంటల పాటు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ఎక్కడికక్కడ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. బీఆర్ఎస్ డైరెక్షన్‌లో రాజ్ భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. గవర్నర్ ఆర్టీసీ బిల్లు క్లియరెన్స్‌పై కార్మికులతో ప్రభుత్వం డ్రామాకు తెరలేపింది. గవర్నర్ రాజకీయ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. డిపోల ముందు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికుల నిరసనకు దిగారు. ఉదయం 11 గంటలకు పీవీ మార్గ్ నుంచి రాజ్‌భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు బయల్దేరి వెళ్లనున్నారు.

Updated Date - 2023-08-05T10:55:53+05:30 IST