TPCC Chief: 111 జీవో రద్దు వెనక లక్షల కోట్ల స్కాం... కేసీఆర్‌పై విరుచుకుపడ్డ రేవంత్
ABN , First Publish Date - 2023-05-22T16:09:54+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బినామీ యాక్టు పర్ఫెక్ట్‌గా అమలవుతోందన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బినామీ యాక్టు పర్ఫెక్ట్‌గా అమలవుతోందన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ (Telangana CM) దోపిడీలో వాటా లేకపోతే కేసీఆర్‌పై(KCR) ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బండి సంజయ్ (Bandi Sanjay), కిషన్ రెడ్డిలు (Kishan Reddy) చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ రంకెలెయ్యడం కాదు... 111 జీవో రద్దుపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలన్నారు. కేసీఆర్‌ను ఉప్పు కారం పెట్టి కొట్టినా తప్పులేదంటూ వ్యాఖ్యలు చేశారు. బందిపోట్లనైనా క్షమించవచ్చు కానీ... కేసీఆర్, కేటీఆర్‌ను క్షమించలేమన్నారు. 111జీవో రద్దుపై కాంగ్రెస్ పార్టీ తరపున నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసీఆర్ నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం వరదల్లో మునిగి వేల మంది చనిపోయే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇప్పటి వరకు భూ కేటాయింపులు జరగలేదని, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయించామని గుర్తుచేశారు. 5100 గజాల కోసం పైసలు కట్టామని... కానీ భూ కేటాయింపు జరగలేదన్నారు. అందుకే ఇప్పటికీ కిరాయికి ఉంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ తన పార్టీ ఆఫీసుకి 11 ఎకరాలు కేటాయించుకోడం దుర్మార్గమని మండిపడ్డారు. తమ కార్యాలయానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. బండోడు, గుండోడు తమను తొత్తులని తిడుతారని టీపీసీసీ చీఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
111 జీవో రద్దు అణువిస్పోటనం లాంటిది...
111 జీవో పరిధిలో టీఆర్ఎస్ వాళ్ళు వందలాది ఎకరాలు కొన్నారని.. 111జీవో ప్రాంతానికి తాగునీటి సమస్య కానేకాదన్నారు. బ్రిటిష్ రాజులు, నిజాం ప్రభువులు, సమైక్య పాలకులు హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తూ వచ్చారన్నారు. దుర్మార్గులైన బ్రిటిష్, నిజాం, సమైక్య పాలకులకన్నా కేసీఆర్ దుర్మరంగా పాలిస్తున్నారని విమర్శించారు. పరిపాలనపై పట్టులేని వ్యక్తి నిర్ణయాల వల్ల హైదరాబాద్ ఆగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక హైదరబాద్ విధ్వంసం మొదలైందన్నారు. కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియాను తయారు చేసుకున్నారని ఆరోపించారు. 111 జీవో రద్దు అణువిస్పోటనం లాంటిదన్నారు. హిరోషిమా నాగసాకి లాగా హైదరాబాద్‌ను తయారు చేస్తున్నారన్నారు. 111జీవో రద్దు వెనక దనదాహం, అవినీతి, దోపిడీ ఉన్నాయని మండిపడ్డారు. 111 జీవో పరిధిలోని 80 శాతం భూములు కేసీఆర్ బినామీల చేతుల్లో ఉన్నాయన్నారు. పైపుల కంపెనీ కోసం 111 జీవో రద్దు చేస్తున్నారన్నారు. 111 జీవో రద్దు వెనక లక్షల కోట్ల స్కాం ఉందని ఆరోపించారు. 111జీవో రద్దు ముమ్మాటికీ విధ్వంసమే అని.. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ ఈ విధ్వంసానికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ కుమార్, సోమేష్ కుమార్, కేసీఆర్, కేటీఆర్‌లను అమరవీరుల స్థూపం దగ్గర కట్టేసి రాళ్లతో కట్టి చంపాలన్నారు. హైదరాబాద్ చెరువులన్నీ మాయం అయ్యాయని.. నీళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి ఇల్లు కడుతున్నారన్నారు. రాసుకొరా సాంబ అని కేసీఆర్ చెప్పగానే అరవింద్ వచ్చి రాసుకుంటారు అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.