Vijayashanthi: టోల్ ఫ్రీ నెంబర్ లేదా ప్రత్యేక సెల్ ఉండాల్సిందే..
ABN , First Publish Date - 2023-03-01T20:54:30+05:30 IST
తెలంగాణలో విద్యార్థులు పడుతున్న బాధలు చూస్తుంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అథఃపాతాళానికి వెళ్లిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థులు పడుతున్న బాధలు చూస్తుంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అథఃపాతాళానికి వెళ్లిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కేఎంసీలో వేధింపులకు బలైపోయిన మెడికో ప్రీతి సంఘటన కళ్లల్లో కదలాడుతుండగానే..ఇప్పుడు హైదరాబాద్ నార్సింగిలోని ఒక కార్పోరేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ తదితరుల దాష్టీకానికి బలవన్మరణం పాలయ్యాడని రాములమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. లెక్క తీస్తే ఈ రెండు సంఘటనలకు ముందు జరిగిన ఇలాంటి వేదనాభరితమైన సంఘటనలు ఇంకెన్నో బయటకొస్తాయని ఆమె అన్నారు.
రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..
'తెలంగాణలో విద్యార్థులు పడుతున్న బాధలు చూస్తుంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అథఃపాతాళానికి వెళ్లిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మొన్న వరంగల్ కేఎంసీలో వేధింపులకు బలైపోయిన మెడికో ప్రీతి సంఘటన కళ్లల్లో కదలాడుతుండగానే... ఇప్పుడు హైదరాబాదు నార్సింగిలోని ఒక కార్పోరేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ అక్కడి ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ తదితరుల దాష్టీకానికి బలవన్మరణం పాలయ్యాడు. లెక్క తీస్తే ఈ రెండు సంఘటనలకు ముందు జరిగిన ఇలాంటి వేదనాభరితమైన సంఘటనలు ఇంకెన్నో బయటకొస్తాయి. తెలంగాణ విద్యాశాఖమంత్రి, విద్యాశాఖ కమిషనర్లు, ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి విద్యాశాఖాధికారులు ఏసీ గదులు వదిలిపెట్టి క్షేత్రస్థాయిలో విద్యాసంస్థల్ని సందర్శిస్తూ, విద్యార్థులతో లేదా వారి తల్లిదండ్రులను కలుస్తూ సంప్రదిస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు బయటపడి వాటిని అరికట్టే అవకాశం ఉండేది. ఒక విద్యార్థి ప్రాణం పోయినప్పుడు తప్ప ఈ మంత్రులు, అధికారులు స్పందించరు.... యాంటీ ర్యాగింగ్ కమిటీల వంటివి కనిపించవు. ఏ స్కూలు లేదా కాలేజీలోనైనా ఇలాంటి వేధింపులు జరుగుతున్నప్పుడు వాటిపై ఫిర్యాదు చేసేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలోనే రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ లేదా ప్రత్యేక సెల్ ఎందుకు ఏర్పాటు చెయ్యరు? విద్యాసంస్థల్లో ఉన్న కమిటీల్లో అక్కడివారే సభ్యులుగా ఉంటారు కాబట్టి, తమ సిబ్బందిపై వారు నిష్పాక్షికంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అనుకోలేం. అందువల్ల మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఈ వేధింపులు, ర్యాగింగ్ తదితర అంశాలపై ఫిర్యాదులు తీసుకుని, అప్పటికప్పుడే చర్యలు చేపట్టేలా టోల్ ఫ్రీ నెంబర్ లేదా ప్రత్యేక సెల్ ద్వారా వ్యవస్థను బలోపేతం చెయ్యాలి. వీటి గురించి విద్యార్థులలో విస్తృత ప్రచారం చెయ్యాలి. భావిపౌరులైన మన విద్యార్థుల భవిష్యత్తుపై తెలంగాణ సర్కారుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ తరహా చర్యలు తీసుకోవాలి' అని విజయశాంతి డిమాండ్ చేశారు.