Women's Day Special : ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. 35 ఏళ్లుగా..
ABN , First Publish Date - 2023-03-08T10:22:36+05:30 IST
భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటివరకు సాఫీగా సాగిన కుటుంబం ఒక్కసారిగా వీధిన పడింది.
హైదరాబాద్: భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటివరకు సాఫీగా సాగిన కుటుంబం ఒక్కసారిగా వీధిన పడింది.కష్టాలు ఒక్కొక్కటిగా చుట్టుముట్టాయి..పిల్లల పోషణ, చదువు భారమైంది..భవిష్యత్ ఆగమ్యగోచరంగా తోచింది.. ఏం చేయాలో తెలియని స్థితి.. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ ఇల్లాలు కష్టాలను ఎదురించి..తమ్ముడి సహకారంతో ఆటోడ్రైవర్‌గా జీవితం ప్రారంభించింది. ధైర్యంగా ముందుకు సాగింది. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ఆటో నడుపుతూ కుటుంబ భారాన్ని మోసింది. మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగి పిల్లలను ఉన్నతస్థితికి చేర్చింది. ఆడది అబలకాదు.. సబల అని నిరూపించింది. అతివలకు ఆదర్శంగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే..35 ఏళ్ల కిందట నల్గొండ (Nalgonda)జిల్లా గట్టుప్పల్(Gattuppall)కు చెందిన నల్లవెళ్లి లింగం, ఆయన సతీమణి జయమ్మ బతుకుదెరువుకోసం హైదరాబాద్(Hyderabad)కు వచ్చారు. వారికి సంతోష్‌కుమార్, శ్రవంతి సంతానం. లింగం ఆర్టీసీలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ 2007లో అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం వీధిన పడింది. కుటుంబ భారమంతా లింగం సతీమణి జయమ్మపై పడింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న జయమ్మ తన తమ్ముడు సాయంతో ముందుకు సాగింది. నారగోని శ్రీనివాస్‌యాదవ్ తన అక్క జయమ్మ కష్టాలను చూడలేక ఆటోడ్రైవింగ్ (Auto Driving) నేర్పించి లైసెన్స్(License) ఇప్పించాడు. బీసీ కార్పొరేషన్(BC Corporation) నుంచి ఆటోను మంజూరు చేయించారు. నాటినుంచి నేటి వరకు మొక్కవోని ధైర్యంతో జయమ్మ ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆటో డ్రైవర్‌గా వృత్తిని కొనసాగిస్తూ పిల్లలను జీవితంలో స్థిరపడేలా కృషి చేసింది. ఆటో దుర్గమ్మగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కుమారుడు చెంగిచెర్ల బస్‌డిపోలో ఆర్టీసీ డ్రైవర్. కుమార్తె శ్రవంతి ఎక్స్తైజ్ కానిస్టేబుల్. పిల్లలకు పెళ్లిళ్లు చేసింది. దుర్గమ్మ ఒంటరిగానే పిల్లలను ఉన్నత స్థితికి తీసుకురావడంలో చేసిన కృషిని గుర్తించి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల రవీంద్రభారతీలో మధువన్ చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా సన్మానించింది.
తమ్ముడి ప్రోద్బలంతోనే..
తాను గత 23 ఏళ్లుగా ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. నా తమ్ముడు నారగోని శ్రీనివాస్‌యాదవ్ ఇచ్చిన ధైర్యంతో ముందుకు సాగాను. ఆటో నడపగా అన్ని ఖర్చులు పోనూ రోజు వెయ్యి రూపాయలు సంపాదించా. భర్త మృతితో ఆర్టీసీ నుంచి వచ్చే 2వేల ఫించను సరిపోకపోవడంతో ఆటో దుర్గమ్మగా మారాల్సివచ్చింది. ప్రభుత్వం ఏదైనా ఉపాధి చూపిస్తే ఆటో డ్రైవింగ్‌కు స్వస్తి పలుకుతా.
-ఆటో దుర్గమ్మ, భూపేష్‌గుప్తానగర్‌కాలనీ