Minister Ponguleti: మూడు రోజుల్లో తీపి వార్త వింటారు
ABN , Publish Date - Dec 23 , 2023 | 08:49 PM
మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీపి వార్త వింటారని రెవెన్యూశాఖ & గృహనిర్మాణ, సమాచారా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. శనివారం నాడు ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలోని పాలేరులో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు, దుస్తులు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.
ఖమ్మం: మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీపి వార్త వింటారని రెవెన్యూశాఖ & గృహనిర్మాణ, సమాచారా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. శనివారం నాడు ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలోని పాలేరులో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు, దుస్తులు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ఎన్ని శక్తులు ఎదురైన, ఎన్ని కుట్రలు పన్నినా మీ అందరి దీవెనలతో గెలిచాను. ఎన్నికల సమయంలో చాలా గ్రామాల్లో ఇచ్చిన వాగ్దానాలు త్వరలోనే పూర్తి చేస్తానని.. రైతులు ధరణితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తనను నమ్ముకున్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటానని చెప్పారు. ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు తీసుకొని వెళ్లారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను నెరవేర్చుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రుల ఆధ్వర్యంలో ప్రతి గ్యారెంటీ అమలు చేస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసింది
గతంలో కొంతమందిపై పలు కేసులు పెట్టారని వాటన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు కోట్ల డెబ్బై ఒక్క లక్షల కోట్ల అప్పులు చేసిందని మండిపడ్డారు. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిన గత ప్రభుత్వం రూ.81 వేల కోట్ల అప్పులు చేసి తెలంగాణను అప్పుల పాలు చేసిందన్నారు. ఎన్ని అప్పులు మన నెత్తిన పెట్టిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. గతంలో ఆగి పోయిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఏ ఒక్క అధికారికి డబ్బులు తీసుకుని పోస్టింగ్‌లు ఇవ్వమని చెప్పారు. ప్రజల నుంచి అధికారులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేయాలని ఆదేశించారు. తనను నమ్ముకున్న ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోనని అన్నారు. ప్రజలు కోరుకునే ఇందిరమ్మ రాజ్యం కోసం అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు, తాము కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కక్ష పూరిత చర్యలకు పాల్పడేదిలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.