Maheswar Reddy : టీ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మహేశ్వర్ రెడ్డి రాజీనామా
ABN , First Publish Date - 2023-04-13T13:01:30+05:30 IST
తెలంగాణకు కాంగ్రెస్‌కు ఈ మధ్య షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు.
హైదరాబాద్ : తెలంగాణకు కాంగ్రెస్‌కు ఈ మధ్య షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. నేటి ఉదయమే ఢిల్లీకి చేరుకున్న మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు యత్నిస్తున్నారంటూ తొలుత వార్తలొచ్చాయి. ఇంతలోనే పార్టీకి ఖర్గే తన రాజీనామా లేఖను పంపించేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని రోజులుగా మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నిన్న క్రమశిక్షణ కమిటీ ఆయనకు షో కాజ్ నోటీస్ జారీ చేయడంతో మహేశ్వర్ రెడ్డి మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది.
‘‘కాంగ్రస్ పార్టీలో 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌గా వివిధ హోదాల్లో ఎన్నో ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొని పని చేశాను. ఎలాంటి ఆరోపణల్లేని మచ్చలేని చరిత్ర ఉన్న నేను.. ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు.అయితే కాంగ్రెస్‌లో గత కొన్ని నెలలుగా జరుగుుతన్న రాజకీయ పరిణామాలను చూసి పార్టీలో నేను ఇమడలేనని అర్ధమైంది. అందుకే కాంగ్రెస్‌లో ఇక ఎంత మాత్రం కొనసాగలేనని భావించి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’’ అని మహేశ్వర్‌రెడ్డి రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ఇక నిన్న ఆయన తనకు షోకాజ్ నోటీస్ జారీ చేయడంపై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏ రోజు నేను పార్టీ గీత దాటలేదు. అంతర్గత సమావేశాల్లో మాత్రమే నేను మాట్లాడినా. రేవంత్ వెలుమ కమ్యూనిటీ మీద మాట్లాడినప్పుడు మాత్రమే నేను మాట్లాడలేదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి అంటే నాకు అభిమానం. సీనియర్ల మీటింగ్ నా ఇంట్లో ఉంటే దిగ్విజయ్ కోరిక మేరకు వాయిదా వేశాం. జనరల్ సెక్రటరీని మార్చమని మేము ఎప్పుడూ కోరలేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా. షోకాజ్ ఇవ్వడం బాధాకరం. ఖర్గేను కలిసి నిర్ణయం తీసుకుంటా. నేను పార్టీ మారాలంటే బాజాప్త రాజీనామ చేసి వెళతా. నేను పార్టీ మారాలని ఏ రోజు అనుకోలేదు. నా సమావేశాలకు బీజేపీ నేత అటెండ్ అయ్యారనే ది పచ్చి అబద్ధం. అమిత్ షా ను బీజేపీ పెద్దలను కలిసేవారికి షోకాజ్ ఇచ్చే దైర్యం లేదు. కానీ నాకు ఎందుకు ఇచ్చారో అర్దం కావడం లేదు’’ అని పేర్కొన్నారు.