Etela Rajender: తెలంగాణలో ఎన్నికలపై ఈటల సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 15 , 2023 | 02:46 PM
Telangana: గతంలో బీజేపీకి 14 వందల పైగా ఓట్లు వస్తే ఇప్పుడు ప్రతీ గ్రామంలో కమలం పార్టీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు తయారు అయ్యారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
సిద్దిపేట: తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే ఉంటే ప్రజలు, ధర్మం, న్యాయం గెలిచేవన్నారు. గతంలో బీజేపీకి 14 వందల పైగా ఓట్లు వస్తే ఇప్పుడు ప్రతీ గ్రామంలో కమలం పార్టీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు తయారయ్యారని ఈటల అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరిగిన ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలని, రేపు జరగబోయే ఎన్నికలు నరేంద్ర మోడీకి సంబంధించిన ఎన్నికలన్నారు. ఈ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకొని రెండు పార్టీలకు బీజేపీ ముచ్చెమటలు పుట్టిస్తోందన్నారు.
ఏ స్కీములైనా తాను చేస్తున్నామని, తాముమ ఇస్తున్నామని ఏ నాడూ ప్రధాని మోదీ అనలేదని ఈటల పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తుందని మాత్రమే అంటారని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఏ స్కీములైనా కేసీఆర్ తానిస్తున్నానని అంటారన్నారు. ‘‘కేసీఆర్ ఏమైనా ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నాడా.. నీయబ్బ జాగీరా అని మేము ఎన్నోసార్లు ప్రశ్నించాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తెనే ఏ స్కీములైన వస్తాయని, పెన్షన్‌లు, కళ్యాణ లక్ష్మీ ఉంటాయని, రియల్ ఎస్టేట్ ఉండాలంటే కేసీఆర్ ఉండాలని బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు’’ అని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..