Harish Rao: కుంగిపోవాల్సిన అవసరం లేదు.. ఆ ఎన్నికల్లో సత్తా చాటుదాం
ABN , First Publish Date - 2023-12-12T16:06:26+05:30 IST
Telangana: రాష్ట్రమంతా కొంత ఇబ్బంది ఉన్నా సంగారెడ్డిలో మాత్రం ఈ సారి గులాబీ జెండా ఎగిరిందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బ తిన్నా ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా కష్టపడి పని చేశారన్నారు.
సంగారెడ్డి: రాష్ట్రమంతా కొంత ఇబ్బంది ఉన్నా సంగారెడ్డిలో మాత్రం ఈ సారి గులాబీ జెండా ఎగిరిందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బ తిన్నా ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా కష్టపడి పని చేశారన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. దురదృష్టవశాత్తు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడలేదని.. అందుకు కుంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. వచ్చే పంచాయతీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చూపించాలన్నారు. అధికార పార్టీ వాళ్ళు బీఆర్‌ఎస్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. 2004లో కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వలేదన్నారు. తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఇతరులకు ఉండదన్నారు.
14 ఏళ్ళు కష్టపడి, పదవులు గడ్డి పోచల్లా వదిలేసి తెలంగాణ తెచుకున్నామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదని.. లేనప్పుడు కుంగిపోలేదన్నారు. బీఆర్‌ఎస్ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షమే అని చెప్పుకొచ్చారు. తెలంగాణాని అన్ని రంగాల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది బీఆర్‌ఎస్ అని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని.. వాళ్ళు మనకంటే బాగా చేయాలని కోరుకుందామన్నారు. వాళ్ళు కొన్ని దుష్ప్రచారాలు చేశారని.. ప్రజలు నమ్మారు వాళ్ళకి అధికారం ఇచ్చారన్నారు. కేవలం 2 శాతం ఓట్ల తేడాతో ఒడిపోయామన్నారు. ప్రజలకిచ్చిన హామీల కోసం కొట్లాడుదామని అన్నారు. భవిష్యత్తు బీఆర్‌ఎస్‌కే ఉంటుందని.. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడొద్దన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని... అందరం కలసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఓటమిపై సమీక్ష జరుపుదామని... తప్పు ఒప్పులు సరి చేసుకుందామని హరీష్‌రావు పేర్కొన్నారు.