Etala: ప్రధాని మోదీ ఏనాడు నేను చేస్తున్నానని చెప్పరు..
ABN , First Publish Date - 2023-06-30T16:08:06+05:30 IST
సిద్దిపేట: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏనాడు తాను చేస్తున్నానని చెప్పలేదని, జీతగాన్ని, సేవకుణ్ణి తప్ప ఓనరును కాదంటారని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కానీ ఇక్కడ సీఎం కేసీఆర్ మాట్లాడినా, ఆయన మంత్రులు మాట్లాడినా మేమే ఇస్తున్నామంటారని విమర్శించారు.
సిద్దిపేట: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఏనాడు తాను చేస్తున్నానని చెప్పలేదని, జీతగాన్ని, సేవకుణ్ణి తప్ప ఓనరును కాదంటారని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. కానీ ఇక్కడ సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడినా, ఆయన మంత్రులు మాట్లాడినా మేమే ఇస్తున్నామంటారని విమర్శించారు. శుక్రవారం మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా చేర్యాల కళ్యాణ్ గార్డెన్స్‌లో జనగామ నియోజకవర్గ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులను రద్దు చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. పేదలకు ఇచ్చిన భూములు లాక్కుని, అందమైన భవనాలు కడుతున్నారని విమర్శించారు. పేదలకు కోటి రూపాయలకు ఎకరం భూమి ఉండొద్దని గుంజుకున్నారని, కేసీఆర్ సొంత నియోజకవర్గంలో మూడు, నాలుగు కోట్లకు ఎకరం విలువైన భూములు తీసుకొని పెద్ద వాళ్లకు కట్టపెడుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ సర్కార్ పేదలను కొట్టి.. పెద్దలకు పెడుతోందని, పేదల భూములు వారికి ఉండొద్దనే ఉద్దేశంతోనే ధరణి తెచ్చారని ఈటల రాజేందర్ ఆరోపించారు. సమస్య వస్తే కోర్టుకు పోవడం తప్ప మరో మార్గం లేకుండా చేశారని, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి వచ్చి పేదల కడుపు కొట్టిందన్నారు. 40 కిలోల బస్తాలో మూడు, నాలుగు కిలోలు దోచుకుంటున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లలో అధికార పార్టీ వాళ్ళు వెళ్తేనే పని అయితదని... అధర్మమైన అధికార పార్టీ వాళ్లదే నడుస్తోందన్నారు. రాష్ట్రాన్ని రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని, పుట్టే బిడ్డపైనా రూ. లక్షా 20 వేల అప్పు ఉందన్నారు.
ఆరు నెలలు, ఆరు కోట్లు ఖర్చు చేసి తనను ఓడించాలని చూశారని.. కానీ హుజురాబాద్ ప్రజలు గెలిచారని.. కేసీఆర్ అహంకారం ఓడిందని ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యమ సమయంలో అటుకులు తిని బతికిన కేసీఆర్‌కు హుజురాబాద్‌లో ఖర్చు చేయడానికి రూ. 600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తమ సొమ్మును తీసుకుపోయి పంజాబ్‌లో, మహారాష్ట్రలో పంచడానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అక్రమ సంపాదన రూ. 20 లక్షల కోట్లు ఉంటదని.. దాన్ని కక్కిస్తామన్నారు. ‘మోడీ కి కుటుంబం లేదు.. దేశమే ఆయన కుటుంబం.’ అంటూ వ్యాఖ్యానించారు.