Muttireddy Vs Daughter: చేర్యాల మత్తడి భూమి.. గోడ కూల్చిన స్థలంలో పశువుల సంత.. కొబ్బరికాయ కొట్టిన ముత్తిరెడ్డి కుమార్తె
ABN , First Publish Date - 2023-06-27T15:52:41+05:30 IST
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.
సిద్దిపేట: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (BRS MLA Muttireddy yadagiri Reddy), ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి (Tulja Bhavani Reddy) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. చేర్యాల మత్తడి భూమి ఆక్రమణ విషయమై ఇరువురి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. మత్తడి భూమిని తన పేరిట తెలియకుండానే తండ్రి రిజిస్ట్రేషన్ చేయించారంటూ.. ఆ భూమి చుట్టూ ముత్తిరెడ్డి ఏర్పాటు చేసిన గోడను రెండు రోజుల క్రితం తుల్జా భవాని కూల్చేశారు. తాజాగా అదే ప్రాంతంలో పశువుల విక్రయ సంతను ఎమ్మెల్యే కుమార్తె ప్రారంభించారు. మంగళవారం ఉదయం అఖిలపక్ష నేతలతో కలిసి తుల్జాభవానిరెడ్డి కొబ్బరికాయ కొట్టి సంతను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మరోసారి తండ్రి ముత్తిరెడ్డిపై తుల్జాభవానిరెడ్డి విమర్శలు గుప్పించారు. తనపై, స్థానిక నాయకులపై కేసులు పెట్టడం ఆయన (ముత్తిరెడ్డి) విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ ముత్తిరెడ్డి మహారాష్ట్ర వెళ్లడం ఏంటి అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో తనకు ఎలాంటి పరిచయం లేదని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మత్తడి స్థల విషయంలో ఆరోపణలు చేయడం సరికాదని తుల్జా భావాని రెడ్డి పేర్కొన్నారు.