MLC Kavitha : ఉదయం 7:30 గంటలకు వారితో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్..

ABN , First Publish Date - 2023-03-11T08:19:02+05:30 IST

ఎమ్మెల్సీ కవిత నేడు ఈడీ విచారకు హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి ఉదయం 7.30కు జాగృతి కార్యకర్తలకు కవిత బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు.

MLC Kavitha : ఉదయం 7:30 గంటలకు వారితో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్..

ఢిల్లీ : ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) నేడు ఈడీ (ED) విచారకు హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి ఉదయం 7.30కు జాగృతి (Jagruthi) కార్యకర్తలకు కవిత బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఈడీ విచారణకు వెళ్లే ముందు ఆమె కార్యకర్తలను కలిశారు. నేటి ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీలో ఉత్కంఠ నెలకొంది. మార్చి 9 వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ముందస్తు కార్యక్రమాలు ఉండడంతో 11 వ తేదీన ఈడీ విచారణకు హాజరవుతానని కవిత వెల్లడించారు. కవిత విజ్ఞప్తితో ఈరోజు విచారణ తేదీని ఈడీ అధికారులు ఖరారు చేశారు.

కాగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) కీలక విషయాలు వెల్లడించింది. సౌత్‌ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహిస్తున్న అరుణ్‌ పిళ్లై కవిత బినామీయేనని పునరుద్ఘాటించింది. ఈ కుంభకోణంలో ‘మేడమ్‌ (కవిత)కు 33 శాతం’ ముడుపులు అందినట్లు పేర్కొంది. మొత్తం వ్యవహారాన్ని సిసోడియా, ఆప్‌ నేతల ప్రతినిధి అయిన విజయ్‌ నాయర్‌ నడిపారని.. కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, శరత్‌రెడ్డి, రాఘవ్‌రెడ్డితో కూడిన సౌత్‌ గ్రూప్‌తో కుమ్మక్కయ్యారని వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక కోర్టుకు సమర్పించిన మనీశ్‌ సిసోడియా రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేసింది. కవిత శనివారం విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఈ రిమాండ్‌ రిపోర్టులో మద్యం కుంభకోణంలో ఆమె పాత్రపై మరింత స్పష్టత ఇచ్చింది. దీంతో పక్కా సాక్ష్యాధారాలతో ఆమె అరెస్టుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.

ముగ్గురినీ కలిపి ప్రశ్నించే అవకాశం?

కవితకు బినామీగా చెబుతున్న పిళ్లై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సిసోడియాను శుక్రవారం కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో వారిద్దరితో వేర్వేరుగా, కలిపి కూడా కవితను ప్రశ్నించే అవకాశముందని ఈడీ వర్గాలు తెలిపాయి. విడిగా కూడా కవితను ప్రశ్నిస్తారు. నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. మరోవైపు కవిత కూడా పలుసార్లు ఫోన్లు మార్చారని, ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తున్న క్రమంలో వాటిపైనా ప్రశ్నించే అవకాశం ఉంది. విచారణకు సహకరించపోతే కవితను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా మందిని ఈ కారణంతోనే ఈడీ అరెస్టు చేసింది. అరెస్టు చేసిన తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది.

Updated Date - 2023-03-11T08:19:02+05:30 IST