Amit Shah: తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు: అమిత్‌షా

ABN , First Publish Date - 2023-04-23T19:32:55+05:30 IST

ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు.

Amit Shah: తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు: అమిత్‌షా

చేవెళ్ల: అంచనాలకు తగ్గట్టే ‘చేవెళ్ల విజయ సంకల్ప సభ’లో కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా (Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్‌ రావాలా వద్దా?.. ఢిల్లీలోని ప్రధాని మోదీకి (Prime Minister Modi) వినపడేలా ప్రజలు నినాదించాలని అని అమిత్‌షా పిలుపునిచ్చారు.

9 ఏళ్లుగా బీఆర్ఎస్‌ (BRS) అవినీతి పాలన సాగిస్తోందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్‌ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేపర్‌ లీకేజీపై ప్రశ్నిస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)ని అరెస్ట్‌ చేస్తారా? ఆయన ఏం తప్పు చేశారని అరెస్ట్‌ చేశారు? అని మండిపడ్డారు. అక్రమ అరెస్ట్‌లకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఏ పరీక్ష పెట్టినా పేపర్‌ లీక్‌ అవుతోందని, పేపర్‌ లీకేజీలపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ (CM KCR) స్పందించలేదని తప్పుబట్టారు. పేపర్‌ లీక్‌ ఘటనలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరగడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు ప్రజలకు చేరడం లేదన్నారు. కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలను మోదీ నుంచి దూరం చేయలేరని అమిత్‌షా తేల్చిచెప్పారు.

ప్రధాని సీటు ఖాళ్లీగా లేదు....

‘‘ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్‌ దుర్వినియోగం చేస్తున్నారు. కేసీఆర్‌ ప్రధాని కావాలని ఎన్నో కలలు కంటున్నారు. కేసీఆర్‌.. ప్రధాని సీటు ఖాళీగా లేదని తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో కూడా మోదీనే ప్రధాని. కేసీఆర్‌ ముందు సీఎం సీటు కాపాడుకోవాలి. కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలో ఉంది. ఎంఐఎం MIMకు భయపడే విమోచన దినోత్సవాన్ని జరపట్లేదు. ఓవైసీ ఎజెండానే కేసీఆర్‌ అమలు చేస్తున్నారు. కేసీఆర్‌ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్లది. ఎంఐఎంకు బీజేపీ భయపడదు’’ అని అమిత్‌షా స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-23T19:40:18+05:30 IST