Yadadri Naresh Swati Case: పరువు హత్య కేసును కోర్టు కొట్టివేయడంపై స్వాతి తండ్రి ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2023-01-21T18:07:36+05:30 IST
2017లో సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నరేష్, స్వాతిల పరువు హత్య కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో భువనగిరి జిల్లా సెషన్స్ కోర్ట్ తీర్పు కొట్టి వేసిన విషయం తెలిసిందే. దీనిపై స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి స్పందించారు. శుక్రవారం..
యాదాద్రి : 2017లో సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నరేష్, స్వాతిల పరువు హత్య కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో భువనగిరి జిల్లా సెషన్స్ కోర్ట్ తీర్పు కొట్టి వేసిన విషయం తెలిసిందే. దీనిపై స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి స్పందించారు. శుక్రవారం ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామన్నారు. ఇన్నాళ్లూ మేము ఎలాంటి తప్పూ చేయలేదని చెబుతున్నా.. ఎవరూ నమ్మలేదన్నారు. ఇప్పటికైనా నిజం బయటపడిందని చెప్పారు. కొన్ని మీడియా చానళ్లు (ఆంధ్రజ్యోతి కాదు) కూడా తమను దోషిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతుర్ని కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించామని, కానీ ఆత్మహత్య చేసుకుంటుందని తాము ఊహించలేదన్నారు. నరేష్‌పై తమకు ఎలాంటి కోపం లేదన్నారు. నరేష్ గురించి తమకు ఏమీ తెలియదని, ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెబుతూ వచ్చామని గుర్తు చేశారు. ఇన్నాళ్ల తాము పడ్డ బాధలు.. కోర్టు తీర్పుతో తొలగిపోయాయని సంతోషం వ్యక్తం చేశారు.