Election Results: వర్దన్నపేటలో రిటైర్డ్ పోలీస్ అధికారికి జైకొట్టిన ఓటర్లు
ABN , First Publish Date - 2023-12-04T10:13:07+05:30 IST
ఆదివారం విడుదలైన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌కు అధికారం అప్పజెప్పిన తెలంగాణ ఓటర్లు కొన్ని నియోజకవర్గాల్లో సంచలన విజయాలు అందించారు.
వరంగల్: ఆదివారం విడుదలైన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌కు అధికారం అప్పజెప్పిన తెలంగాణ ఓటర్లు కొన్ని నియోజకవర్గాల్లో సంచలన విజయాలు అందించారు. ముఖ్యంగా కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్ వంటి తదితర బలమైన నేతలు సైతం ఆయా నియోజకవర్గాల్లో ఓటమిపాలయ్యారు. అదే సమయంలో పలువురు అనామకులు సంచలన విజయాలు సాధించారు. అలాంటిదే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్దన్నపేటలో సైతం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఓటర్లు అనూహ్య ఫలితాన్ని ఇచ్చారు. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరి రమేష్‌పై సాధారణ రిటైర్డు పోలీసు అధికారి కేఆర్ నాగరాజు విజయం సాధించారు. రమేష్‌పై నాగరాజు 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలకు ముందు ఇక్కడ కచ్చితంగా బీఆర్‌ఎస్ అభ్యర్థే గెలుస్తారని అంతా భావించారు. ఓటర్లు మాత్రం అరూరి రమేష్‌కు షాకిచ్చి రిటైర్డు పోలీస్ అధికారి నాగరాజును గెలిపించారు. కాగా నాగరాజు గతంలో నిజామాబాద్ సీపీగా పనిచేశారు.
నిజానికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఇక్కడ బీఆర్‌ఎస్‌లో జోరు కనిపించింది. నాగరాజ్ డబ్బులు కూడా పంచకుండా బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ అడ్డంకులు సృష్టించారనే అరోపణలు కూడా వచ్చాయి. దీంతో పోలింగ్‌కు ముందు రోజు కాంగ్రెస్ ఎక్కడా డబ్బులు పంచలేకపోయిందని పలువురు చెబుతున్నారు. అధికార పార్టీ మాత్రం ఓటర్లకు వెయ్యి రూపాయల చొప్పున పంచిదనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి కూడా బీఆర్‌ఎస్ నేతలు అడుగడుగా ఆటంకాలు సృష్టించారని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఓటమి భయం అలుముకుంది. ఇప్పటికే నియోజకవర్గంలో అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తుందేమో అనే అభిప్రయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఓటర్లు మాత్రం వీటన్నింటిని పటాపంచలు చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిని కాదని, కాంగ్రెస్ అభ్యర్థి సాధారణ రిటైర్డ్ ఆఫీసర్ నాగరాజుకు జైకొట్టారు. ఎవరూ ఊహించని విధంగా వర్ధన్నపేట ఓటర్లు నాగరాజును గెలిపించారు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీకి తమ కంచుకోటలో పరాభవం తప్పలేదు.