Congress VijayaBheri: కాంగ్రెస్ కీలక ప్రకటన.. పెళ్లి చేసుకుంటే రూ.లక్ష నగదు, తులం బంగారం
ABN , First Publish Date - 2023-10-18T18:26:08+05:30 IST
తెలంగాణ ఇచ్చి 60 ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని.. కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికైనా తెలంగాణకు విముక్తి కల్పించాలని ప్రజలను రేవంత్‌రెడ్డి కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వం ప్రారంభించింది. ఈ మేరకు ములుగులో విజయభేరి సభను నిర్వహించగా.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. అంతకుముందు రామప్ప ఆలయాన్ని సందర్శించిన వీరు.. ఆ తర్వాత ములుగు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చి 60 ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని.. కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికైనా తెలంగాణకు విముక్తి కల్పించాలని ప్రజలను కోరారు. ఎందరో విద్యార్థులు, యువత త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారని.. అమరుల త్యాగాలతో సాకారమైన తెలంగాణను ఒక కుటుంబం చెరపట్టిందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండే బాధ్యత సోనియా గాంధీ తీసుకున్నారని తెలిపారు.
అంతకుముందు ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రసంగించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆమె ఎద్దేవా చేశారు. ఓరుగల్లు అంటేనే పోరాటాల గడ్డ అని.. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని సీతక్క స్పష్టం చేశారు. పేదలను మరింత పేదలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని విమర్శలు చేశారు. ప్రజల సంపదను ప్రజలకు పంచేందుకే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిందని భట్టి విక్రమార్క అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ జోడోయాత్ర చేశారని.. ప్రత్యేక అటవీ చట్టం తీసుకువచ్చి పోడు సాగుదారులకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.