Etala: ప్రజలకు నేనున్నాననే భరోసా ఇవ్వడానికి మోదీ వస్తున్నారు..
ABN , First Publish Date - 2023-07-06T15:03:24+05:30 IST
వరంగల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న వరంగల్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ సభ ఏర్పాట్లను బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ గురువారం పర్యవేక్షించారు.
వరంగల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఈనెల 8న వరంగల్ (Warangal) పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ సభ ఏర్పాట్లను బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Etala Rajender) గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి సారి ఓరుగల్లు గడ్డమీదకు ప్రధాని మోదీ వస్తున్నారన్నారు. పార్లమెంట్‌కు ఎంపీని పంపించి బీజేపీ (BJP) పార్టీని అక్కున చేర్చుకున్న గడ్డ వరంగల్ అని... ప్రజలకు నేనున్నాననే భరోసా ఇవ్వడానికి ప్రధాని వరంగల్‌కు వస్తున్నారని చెప్పారు.
2400 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులు ప్రధాని మోదీ వచ్చాక రెట్టింపు అయ్యాయని ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఉదయం ఉదయం 9:30 గంటలకు ప్రధాని వరంగల్‌కు చేరుకుంటారని.. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపిచ్చారు. కనీవినీ ఎరుగని తీరుగా ఈ మీటింగ్ సక్సెస్ చేసి తీరుతామన్నారు. అసహనంలో కొంతమంది బీజేపీపై విషం కక్కుతున్నారని.. కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వ్యక్తులు, యూ ట్యూబ్ చానల్స్ బీజేపీ పని అయిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పార్టీ గెలుపునకు వ్యూహ రచన చేయమని నడ్డాకు మోదీ సూచించారన్నారు. కుటుంబపాలనకు అంతం పలికేది బీజేపీయేనని... రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖునీ అయిందని మోదీ ఆందోళన చెందారన్నారు.
చాప కింద నీరులా బీజేపీ కార్యకర్తలు పని చేస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలు తిప్పి కొట్టే సత్తా తెలంగాణ జాతికి ఉందని ఈటల రాజేందర్ అన్నారు. జరుగుతున్న పరిణామాలు ప్రజలంతా గమనించాలని, మాజీ ఆర్థిక మంత్రిగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎంటో తనకు తెలుసునని అన్నారు. ఒంటరి మహిళల పెన్షన్లు నాలుగేళ్లుగా నిలిచిపోయాయని ఈటల విమర్శించారు.