Moranchapalli Warangal: ఇవెక్కడి వరదలు బాబోయ్.. ఏకంగా ఊరికి ఊరే వరదల్లో..
ABN , First Publish Date - 2023-07-27T12:28:42+05:30 IST
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం మోరంచపల్లిలో వర్షాలు ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మోరంచవాగు పొంగడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. ఏకంగా ఊరు మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. వరద ఉధృతితో గ్రామస్థులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని భూపాలపల్లి మండలం మోరంచపల్లిలో వర్షాలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మోరంచవాగు పొంగడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. ఏకంగా ఊరు మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. వరద ఉధృతితో గ్రామస్థులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ప్రవాహంతో ఇళ్లు అన్నీ నీట మునగడంతో ప్రజలు భవనాలపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమను రక్షించాలంటూ సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ ఎదురుచూపులు చూస్తున్నారు. వరద నీటి ఉధృతికి ఇప్పటికే ఐదుగురు గల్లంతయ్యారు. భవనాలు, చెట్లపైకి ఎక్కి మరీ సహాయం చేయండంటూ గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు.
హెలికాఫ్టర్‌ను పంపండి.. కేసీఆర్ ఆదేశం
మరోవైపు మోరంచపల్లి గ్రామ పరిస్థితిపై సీఎం కేసీఆర్ స్పందించారు. సహాయక చర్యలకు హెలీకాఫ్టర్‌ను పంపాలని సీఎస్ శాంతకుమారికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామ పరిస్థితిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో సీఎం మాట్లాడారు. గోదావరి పరిసర ప్రాంతాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కాగా.. రాష్ట్రంలో వర్షాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సీఎంకు సీఎస్ శాంత కుమారి వివరాలు అందజేస్తున్నారు. సహాయక చర్యల కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆర్మీ అధికారులతో కూడా సీఎస్ శాంతకుమారి సంప్రదింపులు జరుపుతున్నారు.
ఎర్రబెల్లి ఏమన్నారంటే...
మోరంచపల్లిలో సహాయక చర్యలు చేపట్టామని ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మోరంచపల్లికి ప్రత్యేక హెలికాప్టర్‌ను పంపిస్తున్నామని.. వరద బాధితులను ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.