Compensation: పరిహారమేది సారూ!
ABN , First Publish Date - 2023-07-25T03:23:28+05:30 IST
నాలుగు నెలల క్రితం నాటి మాట! మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలానికి సీఎం కేసీఆర్ వచ్చారు!
అకాల వర్షాలతో యాసంగి పంట నష్టంపై కేసీఆర్ భరోసా
మహబూబాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పరిశీలన
ఎకరానికి రూ.10వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని హామీ
4నెలలు దాటినా అన్నదాతలకు పూర్తిగా దక్కని పరిహారం
మానుకోటలో మొదటి విడతలో నష్టపోయిన రైతులకే సాయం
2, 3 విడతల జాబితాలోని అన్నదాతల ఎదురుచూపులు
మహబూబాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): నాలుగు నెలల క్రితం నాటి మాట! మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి(Dantalapalli) మండలానికి సీఎం కేసీఆర్(CM KCR) వచ్చారు! అకాల వర్షాలతో యాసంగి పంట నష్టపోయిన అన్నదాతలకు ఎకరానికి రూ.10వేల చొప్పున నష్టపరిహారం(compensation) ఇస్తామంటూ ఓ బాధిత రైతును పరామర్శిస్తూ.. భరోసాగా భుజమ్మీద చేయివేసి మరీ హామీ ఇచ్చారు! అప్పట్లో ఇది.. వివిధ పంటలను, మామిడి తోటలను నష్టపోయి దిక్కుతోచని స్థితిలో పడ్డ రైతుల్లో ఆనందం నింపింది. అయితే ఇప్పటికీ సీఎం ఇచ్చిన హామీ పూర్తిగా అమలు కాలేదు. ఫలితంగా రైతాంగంలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. యాసంగి పంట నష్టంతో పెట్టుబడి అంతా మట్టి కొట్టుకుపోయిందని.. వానాకాలం పంటల పెట్టుబడికి అప్పులు చేయాల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతుల్లో తొలి విడత కింద కొందరికి పరిహారం దక్కగా రెండు, మూడు విడతల కింద జాబితాల్లో ఉన్న రైతులకు ఇప్పటికీ పైసా అందలేదు. గత మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, పెద్ద పెద్ద వడగళ్లు, పిడుగులతో కూడిన భారీ వర్షం(Heavy rain) పలుమార్లు కురిసింది.
ఈ జడివాన ఉధృతికి వరి మొక్కజొన్న, మిర్చి, పెసర, బొప్పాయి. నిమ్మ, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతుల్లో భరోసా నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మార్చి 23న పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర, దంతాలపల్లి, రెడ్డికుంటతండ, పోచారం, వడ్డెకొత్తపల్లి, బొమ్మకల్లు గ్రామాల్లో ఆయన పర్యటించారు. బాధిత రైతుల వద్దకు నేరుగా వెళ్లి.. వారి భుజాలపై చేయి వేసి పరామర్శించారు. ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించి, ఆ సాయం తాలుకు మొత్తం వెంటనే రైతుల ఖాతాల్లో వేస్తామని భరోసా ఇచ్చారు. తర్వాత అధికారులు పంట నష్టంపై మూడు విడతలుగా సర్వే చేసి ఆ జాబితాను ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు రైతులకు మూడు విడతలుగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబాబాద్ జిల్లాలో 29,507మంది రైతులకు సంబంధించి 22,755 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ జిల్లాలో తొలి విడత కింద 11,673ఎకరాలకు సంబంధించి 14,549మంది రైతుల ఖాతాల్లో రూ.11.67 కోట్లు జూన్ 14న జమయ్యాయి. అయితే రెండు, మూడు విడతల కింద 11,082 ఎకరాలకు సంబంధించి 14,958మంది రైతులకు రూ.11.07కోట్ల మేర పంట నష్టపరిహారం అందాల్సి ఉంది. కాగా రెండో విడతలో 8,986ఎకరాలకు సంబంధించి 12,274మంది రైతులకు, మూడో విడతలో 2,096ఎకరాలకు సంబంధించి 2,684మంది రైతులకు పరిహారం అందాల్సి ఉంది. బాధిత రైతుల వివరాలన్నీ వ్యవసాయశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మొదటి విడత డబ్బును విడుదల చేసి.. రెండు, మూడు విడతల పంట నష్టపరిహారం విడుదలకు సంబంధించి జరుగుతున్న జాప్యంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నష్టపరిహారం అందలేదు
నాకున్న ఏడెకరాల్లో గత యాసంగిలో వరి, మిర్చి తోటలు సాగు చేశాను. ఏప్రిల్లో వచ్చిన భారీ వడగళ్ల వానతో పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పటి వరకు పంటనష్ట పరిహారం అందలేదు. సాయం కోసం ఎదురుచూస్తున్నా.
-గుగులోతు బిక్కునాయక్, రైతు, చిన్నగూడూరు, మహబూబాబాద్