Amaravati: నటి జత్వానీ కేసులో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు..
ABN , Publish Date - Sep 05 , 2024 | 09:49 PM
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. కొందరు నాయకులపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు జత్వానీ. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కీలక కామెంట్స్ చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 05: ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. కొందరు నాయకులపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు జత్వానీ. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కీలక కామెంట్స్ చేశారు. మరి ఇంతకీ ఆమె ఎవరిపై కంప్లైంట్ ఇచ్చారు? ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నారు? కీలక వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు ఏపీ రాజకీయాలను ఓ ఊపు ఊపేసింది. ఈ వ్యవహారంలో కీలక ఐపీఎస్ అధికారుల పేర్లతో పాటు.. వైసీపీ ప్రముఖుల పేర్లు కూడా రీసౌండ్ చేశారు. అయితే, తాజాగా విజయవాడకు వచ్చిన నటి జత్వాని.. వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని కీలకమైన డాక్యూమెంట్స్‌ని పోలీసులకు అందజేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన జత్వాని.. వైసీపీ నేతలు తన సమస్యను ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. తనను వేధించిన కఠినంగా శిక్షించాలని జత్వాని డిమాండ్ చేశారు. తన ఫిర్యాదును ప్రత్యేక బృందం దర్యాప్తు అధికారి శ్రవంతికి ఇచ్చారు.
ఇదిలాఉంటే.. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి జత్వాని నుంచి సేకరించిన కీలక వస్తువులను(సాక్ష్యాధారాలు) భద్రపరచాలని, ఆమె నుంచి సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను తిరిగి ఆమెకు ఇవ్వొద్దంటూ విద్యాసాగర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో ఎలాంటి ప్రెస్‌మీట్స్ పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణ వరకు కేసులోని సాక్ష్యాధారాలను భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.