Amaravati : బొత్స వద్దన్నారు..అధికారులు సరేనన్నారు..!
ABN , Publish Date - Jul 05 , 2024 | 04:38 AM
విద్యా కానుకను కావాల్సిన వారికి కట్టబెట్టడం వెనుక విద్యా శాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హస్తం ఉందన్న విషయం వెలుగులోకి వస్తోంది. ఆయన ఒత్తిడితోనే అప్పట్లో అధికారులు టెండర్లకు మంగళం పాడేశారు.
బొత్స ఒత్తిడితో విద్యాకానుక టెండర్లకు మంగళం
నామినేషన్ కాంట్రాక్టు వెనుక సూత్రధారి ఆయనే
తొలుత టెండర్ల కోసం సర్కారుకు సమగ్ర శిక్ష ఫైలు
మాజీ మంత్రి ఒత్తిడితో నేరుగా ఇచ్చేలా జీవో
తర్వాత షార్ట్ టెండర్లు పిలవాలని నిర్ణయం
దానినీ అడ్డుకున్న అప్పటి విద్యాశాఖ మంత్రి
ఫలితంగా ఇప్పుడు అరకొరగా కిట్ల సరఫరా
సకాలంలో స్కూళ్లకు చేరని విద్యాకానుక కిట్లు
విచారణ లేకుండా ఓ అధికారి ప్రయత్నాలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
విద్యా కానుకను కావాల్సిన వారికి కట్టబెట్టడం వెనుక విద్యా శాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హస్తం ఉందన్న విషయం వెలుగులోకి వస్తోంది. ఆయన ఒత్తిడితోనే అప్పట్లో అధికారులు టెండర్లకు మంగళం పాడేశారు. తొలుత టెండర్లు పిలవకుంగా బలవంతంగా జీవో ఇప్పించిన ఆయన ఆ తర్వాత షార్ట్ టెండర్లకు వెళ్దామని అధికారులు సూచించినా ఒప్పుకోలేదు.
టెండర్లు లేకుండా నేరుగా కాంట్రాక్టు ఇచ్చేవరకూ ఆయన అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి ఆయన కోరుకున్నట్టుగా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు కట్టబెట్టారు. అయితే ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. బడులు తెరిచి నెల కావస్తున్నా ఎక్కడా విద్యార్థులకు పూర్తిస్థాయి స్టూడెంట్ కిట్లు అందించలేదు.
కాంట్రాక్టర్లే మొత్తం వస్తువులను రాష్ర్టానికి పంపలేదు. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో కాంట్రాక్టర్లు ఈ నిర్లక్ష్య ధోరణి అవలంబించారు. సకాలంలో వస్తువులు ఉత్పత్తి చేయలేదు. దీంతో.. ప్రభుత్వం మారినా ఇప్పుడు చేసేదేం లేకుండా పోయింది. స్టూడెంట్ కిట్ల పంపిణీలో తీవ్ర జాప్యానికి నామినేషన్‌పై కాంట్రాక్టు ఇవ్వడేమనని స్పష్టమవుతోంది.
అప్పట్లో ఇదీ జరిగింది
విద్యా కానుక కోసం ఏటా సమగ్రశిక్ష విభాగం టెండర్లు పిలుస్తుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యాకానుక కోసం గతేడాది సెప్టెంబరులో టెండర్ల ఫైలును సమగ్రశిక్ష కార్యాలయం ప్రభుత్వానికి పంపింది. అయితే ఈసారి టెండర్లు అక్కర్లేదని అప్పటి మంత్రి బొత్స అధికారులపై ఒత్తిడి చేశారు.
దీంతో ఎలాంటి నిర్ణయం లేకుండానే దాదాపు నాలుగు నెలలపాటు టెండర్ల ఫైలును పక్కన పెట్టారు. చివరికి జనవరిలో టెండర్లు లేకుండా కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి కాంట్రాక్టు ఇచ్చేయాలని అప్పటి పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీచేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో అధికారులు చర్చలు జరిపారు. పాత బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున మళ్లీ కాంట్రాక్టు తీసుకోలేమని తొలుత కాంట్రాక్టర్లు వెనకడుగు వేశారు.
దీంతో ఈ తలనొప్పిన అధిగమించేందుకు షార్ట్ టెండర్లు పిలిచి ఎంపిక చేద్దామని ప్రవీణ్ ప్రకాశ్ నిర్ణయించారు. దానివల్ల తమకు కావాల్సిన కాంట్రాక్టర్లు ఉండరు కాబట్టి బొత్స దాన్ని కూడా అడ్డుకున్నారు. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే కారణం చూపిస్తూ రెండు విడతలుగా రూ.300 కోట్లు చొప్పున రూ.600 కోట్లు పాత బకాయిలు ఇచ్చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు 5 నుంచి 7శాతం కమీషన్లు నొక్కేశారు.
దాదాపు రూ.40 కోట్లు ముడుపులు ఇచ్చామన్న ధైర్యంతో కాంట్రాక్టర్లు ఇప్పుడు కిట్ల సరఫరాను ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటివరకూ మండల కేంద్రాలకు కూడా పూర్తిస్థాయిలో స్టూడెంట్ కిట్లు సరఫరా కాలేదు. పిక్టోరియల్ డిక్షనరీ, నోట్ పుస్తకాలు, బెల్టులు మాత్రమే వెళ్లాయి. పాఠ్య పుస్తకాలు 96 శాతం, బ్యాగులు 94 శాతం, బూట్లు 96 శాతం, యూనిఫాంలు 63 శాతం, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు 52శాతం చేరాయి. వీటిలో కూడా సగమే పాఠశాలలకు వెళ్లాయి.
28.88లక్షల మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ జరిగిందని పాఠశాల విద్యాశాఖ చెబుతున్నా ఎక్కడా పూర్తిస్థాయిలో అందలేదు. విద్యార్థులకు ఒకట్రెండు వస్తువులు మాత్రమే పంపిణీ చేశారు. యూనిఫాంలు అతి కొద్ది మందికే అందాయి. కిట్‌లో మిగిలిన వస్తువులు రాకపోవడంతో పాఠశాలలో తొలుత పాఠ్య పుస్తకాల పంపిణీకి ప్రాధాన్యత ఇస్తున్నారు.
విచారణ అవసరం లేదంటూ...
విద్యా కానుక కాంట్రాక్టుల విషయంలో విచారణకు ఆదేశించకుండా ఉండేందుకు ఓ ఉన్నతాధికారి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖలో మొత్తం ముగ్గురు ఉన్నతాధికారులు కీలకంగా వ్యవహరించారు. వారిలో ఒకరు టీచర్ల పట్ల నియంతృత్వ ధోరణి ప్రదర్శించారు.
మరో అధికారి అక్రమాలు జరుగుతున్నా మౌనంగా ఉండిపోయారు. వీరిద్దరూ కమీషన్ల వ్యవహారంలో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. మరో అధికారి మాత్రం అన్నీ తానై చక్రం తిప్పారు. ఆయనే ఇప్పుడు విద్యా కానుకపై విచారణ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో మంత్రితో అంటకాగిన ఆ అధికారి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించేందుకు తాపత్రయపడుతున్నారు.
గత ప్రభుత్వంలో అన్నీ అక్రమాలేనని టీడీపీ గగ్గోలు పెడుతుంటే ఆ ఉన్నతాధికారి మాత్రం ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని, అంతా సక్రమంగానే జరిగిందని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా టెండర్లు లేకుండా కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి కాంట్రాక్టులు కట్టబెట్టాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించినప్పుడు... సరిగ్గా పాత కాంట్రాక్టర్లు 19 మందినే తీసుకొచ్చి అప్పనంగా కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారనే దానిపై ఆయనే సమాధానం చెప్పాలి.