Amaravati : మూలకు చేరిన మగ్గం
ABN , Publish Date - Aug 21 , 2024 | 05:56 AM
దేశంలోనే అతి పెద్ద చేనేత పరిశ్రమగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా నేతన్నలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
జగన్ ఐదేళ్ల పాలనలో నిర్వీర్యం
నేడు టెక్స్‌టైల్ పాలసీపై చంద్రబాబు కీలక నిర్ణయం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
దేశంలోనే అతి పెద్ద చేనేత పరిశ్రమగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా నేతన్నలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చేనేతలు ఇప్పుడు పూట కూలీ కూడా తెచ్చుకోలేక పోతున్నారు. దారానికి రంగులద్ది కళ్లకు ఇంపైన రంగుల వస్త్రాన్ని నేసిన కళాకారుల కళ్లు నేడు చెమ్మగిళ్లుతున్నాయి. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో బతుకు భారమై వృత్తికి దూరమవుతున్నారు.
అపురూపమైన కళను వదిలి వ్యవసాయ కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా బతుకు వెళ్లదీస్తున్నారు. ముడిసరుకు సబ్సిడీపై ఇచ్చి పని కల్పించాలని, నేసిన వస్త్రాన్ని ప్రభుత్వ అవసరాలకు కొనుగోలు చేయాలని వేడుకొంటున్నారు.
ఐదేళ్లుగా చేనేత పనిలేక, ప్రభుత్వ సహకారం అందక మూలన పడ్డ మగ్గాలకు తిరిగి చప్పుళ్లు చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పదమూడు జిల్లాల నుంచి 26 జిల్లాలకు చేరిన రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల (సోసియో ఆడిట్ 2023) ప్రకారం 1282 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. సొంత మగ్గంపై వస్త్రాలు నేసే కార్మికులతో కలిపి రెండు లక్షలకు పైగా నేతన్నలు ఉండగా, అనుబంధ కార్మికులు మరో రెండున్నర లక్షల మంది ఉంటారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వం, ఉమ్మడి-విభజిత ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వీరి జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడింది.
నూలు సబ్సిడీ మొదలు వస్త్రానికి మార్కెటింగ్ సౌకర్యం వరకూ చేయూత అందించింది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ శాఖల అవసరాలకు ఆప్కో ద్వారా నేత వస్త్రాలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలంటూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో 24, విభజిత రాష్ట్రంలో జీవో 142 విడుదల చేసింది.
చేనేత రంగానికి ఊతమిస్తూ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ఆప్కోను బలోపేతం చేసి రిబేటు అమలు చేసింది. ఐదేళ్ల క్రితం అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి గతంలో ఉన్న సదుపాయలన్నీ తీసేశారు.
కమీషన్లు ఇచ్చే ప్రైవేటు వస్త్ర వ్యాపారులకే వైసీపీ పాలకులు ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చారు. నాలుగున్నర లక్షల మందిలో కేవలం 81 వేల మందికి నెలకు రెండు వేల చొప్పున నేతన్న నేస్తం అందించి ఎంతో చేశామని గొప్పలు చెప్పింది. అసలైన పని లేక పోవడంతో రాష్ట్రంలో చేనేత రంగం కుదేలైంది.
పని కల్పించాలంటూ చేనేత జౌళి శాఖ అధికారుల వద్దకు సహకార సంఘాల ప్రతినిధులు వెళ్లి అడిగినా పట్టించుకోలేదు. ‘కమిషనర్‌కు చెబితే సెక్రటరీ అంటారు. సెక్రటరీ వద్ద కెళితే జీఎంను కలవమంటారు.
ఆయనేమో ఆప్కో ఎండీ పేరు చెబుతారు’ అని నేతన్నలు వాపోయారు. చేనేత వస్త్రాలు విక్రయించే ఆప్కో ఉన్నతాధికారి (చేనేత సామాజిక వర్గం) వద్దకు బనగానపల్లె కార్మికులు వస్తే.. ‘నాకు స్వెట్ (చెమట) అలర్జీ ఉంది. మీరు బయటికి వెళ్లండి. ఏసీ రూములో వాసన వస్తోంది’ అంటూ బయటికి పంపారు.
కన్నీటితో బయటకు వెళ్లిన కార్మికులు మగ్గాలు మూలన పడేసి, చేనేత వృత్తి వదిలి కర్ణాటకలో భవన నిర్మాణ కార్మికులుగా పనికి వెళుతున్నారు. తమకు ఎంతో ఇష్టమైన చేనేత కళను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మగ్గమున్న ప్రతి కార్మికుడికి యార్న్, డైయింగ్, డిజైన్, మార్కెటింగ్ లాంటి సహకారం అందిస్తేనే మనుగడ సాధ్యమని గుర్తు చేస్తున్నారు.
గడిచిన ఐదేళ్ల ప్రతికూల పరిస్థితులతో వృత్తిపై పూర్తిగా ఆశలు వదిలేసుకున్నామని, ఇటీవల చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమలో ఆశలు చిగురింపజేశాయని గుర్తు చేస్తున్నారు. ఏపీ టెక్స్‌టైల్స్ పాలసీ తీసుకొచ్చేందుకు బుధవారం సమావేశం అవుతున్న చంద్రబాబు తమకు న్యాయం చేయాలని నేతన్నలు విన్నవిస్తున్నారు.