Amaravati : కక్షల కేసులపై ఏడుపు!
ABN , Publish Date - Aug 16 , 2024 | 04:02 AM
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం తనకు ఉన్న అధికారాలతో ప్రతిపక్ష నాయకులపై, సామాన్యులపై ఎడాపెడా దొంగకేసులు పెట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని సమీక్షిస్తుందనగానే, జగన్ రోతపత్రిక ఉలిక్కిపడుతోంది.
కొత్త ప్రభుత్వం వాటిని సమీక్షిస్తుంటే నీరు గార్చేస్తున్నారంటూ నీచ రాతలు
గత ఐదేళ్లలో విపక్షాలపై 3,000 కేసులు
రాజకీయ ప్రేరేపిత కేసులే ఇవన్నీ
రివ్యూ చేస్తే రోత పత్రికకు ఉలుకెందుకో?
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం తనకు ఉన్న అధికారాలతో ప్రతిపక్ష నాయకులపై, సామాన్యులపై ఎడాపెడా దొంగకేసులు పెట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని సమీక్షిస్తుందనగానే, జగన్ రోతపత్రిక ఉలిక్కిపడుతోంది. భుజాలు తడుముకుంటోంది. గత ఐదేళ్లపాటు జగన్ పెట్టిన దొంగ కేసుల గుట్టు రట్టవుతుందని భయమా? ఆ కేసులన్నీ నిజమే అనుకుని నమ్మి ఓట్లేసి 11 సీట్లు ఇచ్చిన ఓటర్లు కూడా దూరం అవుతారని కంగారా? కేసులను సమీక్షల పేరుతో చంద్రబాబు నీరుగార్చుతున్నారంటూ గురువారం రోతపత్రికలో ఒక ఏడుపుగొట్టు కథనం ప్రచురించారు. జగన్ పెట్టిన కేసులన్నీ తప్పులనడానికి ప్రజలముందే సాక్ష్యాలున్నాయి. అవినీతి అంటూ పెట్టిన కేసుల్లో ఒక్క రూపాయిని కూడా చూపించలేకపోయారు. ఇలాంటి నియంతృత్వ పోకడలతోనే జనాలు కూడా విసుగెత్తిపోయి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు.
అయ్యో.. జనాలకు తెలిసిపోతే ఎలా?
పోలీసులను అడ్డగోలుగా ఉపయోగించుకుని అక్రమ కేసులు పెట్టడానికి జగన్‌కి ఏ అధికారాలైతే ఉన్నాయో.. వాటిని సమీక్షించి తప్పొప్పులు తేల్చడానికి కూడా కూటమి ప్రభుత్వానికి అవే అధికారాలుంటాయి. తప్పుడు కేసుల లోగుట్టు బయటపడితే, అందుకోసం వారు చేసిన ఘోరాలు వెలుగులోకి తెస్తే అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో చేశారో ప్రజలకు మరింత స్పష్టత వస్తుంది. ఇదే జగన్‌ను, ఆ రోతపత్రికను వేధిస్తున్న అంశం.
జగన్ హయాంలో 3,000కు పైగా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టారు. 2560 మందికి పైగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. గతంలో చంద్రబాబుపై ఒక్క బాబ్లీ కేసు మాత్రమే ఉండేది. జగన్ హయాంలో 17 కేసులు పెట్టారు. పవన్ కల్యాణ్‌పై 7 కేసులు పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66 కేసులు పెట్టారు.
అన్నీ కక్షసాధింపు కేసులే...
సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయని ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారు. పులివెందులలో పోటీ చేసిన బీటెక్ రవిని ఏ కారణం చెప్పకుండా జైల్లో పెట్టారు. అధికారులపై దాడి చేశారంటూ కూన రవికుమార్‌పై కేసులు నమోదు చేశారు. ఫర్నిచర్ దుర్వినియోగం చేశారంటూ మాజీ స్పీకరు కోడెల శివప్రసాదరావుపై 18 కేసులు పెట్టారు.
ఆ అవమానం తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుత హోం మంత్రి, టీడీపీలోని ఎస్సీ నాయకురాలు వంగలపూడి అనితపై అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఇప్పటి స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు అత్యాచారయత్నం కేసు పెట్టారు.
వెంటాడి.. వేధించారు..
అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును లాక్‌పలో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఎంపీ అయిఉండి కూడా, ఐదేళ్ల పాటు సొంత నియోజకవర్గంలోకి రాలేని భయానకవాతావరణం సృష్టించారు జగన్ ప్రభుత్వం అమరావతిలోని రైతులను, మహిళలను కనీసం మనుషులుగా కూడా చూడలేదు. కేసులు, అరెస్టులు, సోషల్ మీడియాలో బూతులతో వారిని చిత్రహింసలు పెట్టింది.
రాజకీయ ప్రేరణలతో పెట్టిన కేసులే ఇవన్నీ. నోరెత్తాలంటే భయపడాలన్న నియంతృత్వ పోకడలతో జగన్ పెట్టిన అక్రమ కేసులను వీరంతా ఎందుకు భరించాలి? ప్రభుత్వం మారాకైనా ఉపశమనం కలగాలి కదా!
అందుకే చంద్రబాబు ఈ కేసులను సమీక్షించి బాధితులకు ఉపశమనం కలిగించేందుకు పూనుకున్నారు. చంద్రబాబును స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. బాబు అరెస్టు జరిగిన తర్వాత ఎనిమిది నెలల పాటు వైసీపీనే అధికారంలో ఉంది. కానీ, ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. అలాంటప్పుడు ఆ కేసు కక్షపూరితం, అక్రమమే అవుతుంది. ఇలాంటి వాటిని ఎందుకు భరించాలి? అందుకే ప్రభుత్వం దిద్దుబాటుకు సిద్ధమైంది.