Amaravati : వాసుదేవరెడ్డికి సీఐడీ ఉచ్చు
ABN , Publish Date - Aug 19 , 2024 | 03:12 AM
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి, ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సీఐడీ అధికారులు పిలిపించి విచారించారు.
మద్యం స్కాంలో పిలిపించి ప్రశ్నించిన అధికారులు!
కీలక వివరాలు బయటపెట్టిన బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ
ఆ వివరాలను ఆధారాలతో పోల్చి చూస్తున్న సీఐడీ అధికారులు
డిస్టిలరీల యజమానులనూవిచారించాక తదుపరి చర్యలు
మాజీ సీఎం జగన్‌కూ ఇక్కట్లే
అందుకే పెద్దపెద్ద లాయర్లతో చర్చలు
ఎన్నికల ఫలితాలొచ్చాక ఫైళ్లు, హార్డ్ డిస్కులు తీసుకెళ్లిన వాసుదేవరెడ్డి
జూన్ 6 నుంచి అజ్ఞాతంలోనే
జగన్ బెంగళూరు ప్యాలెస్ సమీపాన ఓ హోటల్లో వాసుదేవరెడ్డి మకాం!
లాయర్లతో కలిసి లోపలకు వెళ్లిన వైనం
పసిగట్టిన సీఐడీ బృందాలు.. వెంటనే పిలుపు
అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి, ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సీఐడీ అధికారులు పిలిపించి విచారించారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన కోసం సీఐడీ బృందాలు విస్తృతంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ కూడా చేసింది. నాలుగు రోజుల క్రితం బెంగళూరులో ఆయన ఆచూకీ సీఐడీకి లభించింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి చెందిన యలహంక ప్యాలె్‌సకు సమీపంలోని ఒక హోటల్లో వాసుదేవరెడ్డి మకాం వేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. రెండ్రోజుల క్రితం ఆయన్ను పిలిపించి విచారించినట్లు తెలిసింది. మొత్తం కుంభకోణం తీరుతెన్నులపై ప్రశ్నించినట్లు సమాచారం.
మద్యం పాలసీ నిర్ణయాలు మొదలుకుని.. విక్రయాలు, ముడుపులు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు.. కంపెనీల నుంచి వసూలు చేసిన పర్సంటేజీలు, అందులో తాడేపల్లి ప్యాలె్‌సకు చేరింది ఎంత.. ప్రభుత్వ పెద్దల్లో ఎవరి పాత్ర ఎంత.. అనే వివరాలను సీఐడీ అధికారులు రాబట్టారు. 2019-24 మధ్య ఏయే మద్యం కంపెనీల నుంచి ఎంత వ్యాపారం జరిగింది.. పొరుగు రాష్ట్రాలతో పొల్చితే ఆ బ్రాండ్ మద్యం ధరలు ఏపీలో ఎందుకు ఎక్కువగా ఉన్నాయి..
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన 32 రకాల నాసిరకం బ్రాండ్ల నుంచి వసూలు చేసింది ఎంత..? జగన్ అనుచరులకు సంబంధించిన 11 డిస్టలరీల నుంచే 65 శాతం మద్యం కొనుగోలు చేయడం వెనుక మతలబు ఏమిటి..?
మద్యం ధరలు విపరీతంగా పెంచడం వెనుక అసలు రహస్యం ఏమిటి..? గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువగా అమ్ముడుపోయిన ఐదు పాపులర్ బ్రాండ్లను 2019 తర్వాత నిలిపివేయడానికి కారణాలేంటి.. అని వాసుదేవరెడ్డిపై ప్రశ్నలవర్షం కురిపించారు. యావత్ కుంభకోణంపై ఆయన నుంచి ఆశ్చర్యపోయే సమాచారాన్నే రాబట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ముందే తరలించేశారు..!
ఎన్నికల్లో జగన్ ఘోరపరాజయం పాలుకావడం.. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో.. తనకు కష్టాలు తప్పవని వాసుదేవరెడ్డి ముందుగానే గ్రహించారు. జూన్ 6న (ఫలితాలు వెలువడిన మూడోరోజు) విజయవాడ ప్రసాదంపాడులోని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి అర్ధరాత్రి కొన్ని ఫైల్స్, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, ఇతర ఆధారాలను కారులో తీసుకెళ్లారు. కొందరు గమనించి కొంతదూరం వెంబడించారు.
నున్న పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో.. మంగళగిరి సీఐడీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. జూన్ 7న 12 మంది సీఐడీ సభ్యుల బృందం హైదరాబాద్‌లోని వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను విచారించింది. కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుంది.
వాసుదేవరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీఐడీ బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటి నుంచి జగన్ తరచూ తన బెంగుళూరు (యలహంక) ప్యాలెస్‌కు వెళ్తున్నారు. అక్కడ కూడా సీఐడీ నిఘాపెట్టింది. ఈ క్రమంలో వాసుదేవరెడ్డి కొందరు న్యాయవాదులతో కలిసి ఆ ప్యాలె్‌సలోకి వెళ్లినట్లు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో ఆయన్ను సీఐడీ ఈ నెల 16న పిలిపించి ప్రశ్నించినట్లు సమాచారం.
ఆ సందర్భంగా కీలక వివరాలు ఆయన బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలను వాస్తవాలతో బేరీజు వేసుకుని అసలు సూత్రధారులకు ఉచ్చు బిగించే దిశగా సీఐడీ అధికారులు అడుగులు వేస్తున్నారు.
మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్ సహా డిస్టిలరీల యజమానులను కూడా విచారించాక తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. కాగా.. ఈ కేసు తన మెడకు చుట్టుకుంటే ఎలా బయటపడాలన్న అంశంపై పెద్దపెద్ద న్యాయవాదులతో జగన్ యలహంక ప్యాలె్‌సలో చర్చలు జరిపారని వాసుదేవరెడ్డి వెల్లడించినట్లు సమాచారం.