Amaravati : రాష్ట్రంలో మళ్లీ జన్మభూమి!
ABN , Publish Date - Aug 09 , 2024 | 05:49 AM
రాష్ట్రంలో మళ్లీ జన్మభూమి కార్యక్రమం చేపట్టాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. పేదరిక నిర్మూలనకు పీ4 విధానాలను అమలు చేయాలని నిశ్చయించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు వద్దు
ఆ విధానాన్ని రద్దు చేయండి: సీఎం
సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన.. ఉద్యోగుల క్రమబద్ధీకరణ
క్లస్టర్ వ్యవస్థతో గ్రామీణ ప్రజలకు సేవలందించే యోచన
జన్మభూమి-2తో
అభివృద్ధి, సంక్షేమం!
పీ4 విధానంతో సంపద సృష్టికి కృషి: పల్లా, కాల్వ
అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ జన్మభూమి కార్యక్రమం చేపట్టాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. పేదరిక నిర్మూలనకు పీ4 విధానాలను అమలు చేయాలని నిశ్చయించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. పొలిట్‌బ్యూరో సమావేశం వివరాలను వీరిద్దరూ మీడియాకు తెలియజేశారు. ప్రజారాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, వెనుకబడిన 8 జిల్లాలకు కేంద్ర సహకారం, నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఆగస్టు 15న అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం, ఉపాధి, నీరుచెట్లు బిల్లుల విడుదల, ప్రజావేదిక, ప్రజాదర్బారులో అందిన అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు తదితర అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభించింది. ఇప్పుడు జన్మభూమి-2 కింద ప్రజలందరి సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తాం.
రూ.100కు పార్టీ సభ్యత్వం, పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాదబీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ పొలిట్‌బ్యూరో నిర్ణయం తీసుకుంది. నిబద్ధతతో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు చెప్పారు. ‘గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాలు, దోపిడీ, భూకబ్జాలపై కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఏడు శ్వేతపత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.
కూటమి అధికారంలోకి రాగానే పింఛన్లు రూ.4 వేలకు పెంపు, 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపు ణ్య గణన హామీల అమలును ప్రారంభించాం.
ఒక్క రోజులోనే 98 పింఛన్లు పంపిణీ చేశాం. పీ4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు, సంపద సృష్టికి కృషి చేస్తాం.. ఇటీవలి వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు’ అని పల్లా, కాల్వ వెల్లడించారు.
ఇదీ ‘జన్మభూమి’
చంద్రబాబు 1995లో తొలిసారి సీఎం అయిన తర్వాత పాలనలో వినూత్నమైన విధానాలను అమలు చేశారు. అందులో... ‘జన్మభూమి’ కార్యక్రమం ఒకటి! ఇలాంటి కార్యక్రమం అప్పటికే వివిధ రాష్ట్రాల్లో, వేర్వేరు పేర్లతో అమలులో ఉంది.
దీనిని చంద్రబాబు మరింత మెరుగు పరిచి అమలు చేశారు. ప్రజలు, ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని కలుపుతూ... ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికగా మార్చారు. ఇందులో ప్రవాసాంధ్రులనూ భాగస్వాములను చేశారు.
ఒక ఊరిని లేదా ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి సహకరించేలా చూశారు. మహిళా జన్మభూమి, రైతు జన్మభూమి, కార్మికుల జన్మభూమి... ఇలా ప్రత్యేకంగా అంశాల వారీగా కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. జన్మభూమిలో ప్రజలు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేవారు. కలెక్టర్లకు ఈ బాధ్యత అప్పగించారు.