Share News

Amaravati : మిగతా శ్వేతపత్రాలు సభలోనే!

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:02 AM

జగన్‌ ఏలుబడిలో కొన్ని కీలక రంగాల్లో జరిగిన విధ్వంసంపై రూపొందిస్తున్న శ్వేతపత్రాలను అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఏడు శ్వేతపత్రాలకు గాను నాలుగింటిని సీఎం చంద్రబాబు ఇప్పటికే విడుదల చేశారు.

Amaravati : మిగతా శ్వేతపత్రాలు సభలోనే!

  • రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలు

  • తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం

  • మర్నాడు ధన్యవాద తీర్మానంపై చర్చ-ఆమోదం

  • మిగతా 3 రోజుల్లో రోజుకో శ్వేతపత్రంపై చర్చ

  • సెప్టెంబరులో పూర్తిస్థాయిబడ్జెట్‌ సమావేశాలు!

అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ఏలుబడిలో కొన్ని కీలక రంగాల్లో జరిగిన విధ్వంసంపై రూపొందిస్తున్న శ్వేతపత్రాలను అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఏడు శ్వేతపత్రాలకు గాను నాలుగింటిని సీఎం చంద్రబాబు ఇప్పటికే విడుదల చేశారు. ఇందులోని ముఖ్యాంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా విలేకరుల సమావేశాల్లో వివరించారు. వైసీపీ పాలనలో దిగజారిన శాంతి భద్రతలు-గంజాయి డ్రగ్స్‌ విశ్వరూపం.. మద్యం రూపంలో రూ.వేల కోట్ల దోపిడీ.. కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అన్న అంశాలపై ఇంకా మూడు పత్రాలను విడుదల చేయాల్సి ఉంది. ఈ నెల 22వ తేదీన (సోమవారం) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు వీటిని నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది.


ఈ సమావేశాల్లోనే సభ ముందు ఈ మిగిలిన శ్వేతపత్రాలను పెట్టాలని నిర్ణయించింది. ‘అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా ఉంటుంది. మేం చెప్పిన అంశాలపై ప్రతిపక్ష సభ్యులు వారి అభిప్రాయం కూడా చెప్పవచ్చు. చర్చ జరుగుతుంది. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయి. మేం ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ నిర్వహించాలనుకుంటున్నాం. దానికి ఇది ఉపకరిస్తుంది’ అని ప్రభుత్వ ముఖ్యుడొకరు చెప్పారు. సభలో మొదటి రోజు ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తారు. రెండో రోజు ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు. మిగిలిన మూడ్రోజుల్లో రోజుకో శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టి.. అదే రోజు దానిపై చర్చ పూర్తి చేయాలని భావిస్తున్నారు. 26వ తేదీతో సమావేశాలు ముగుస్తాయి. తిరిగి సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని సర్కారు యోచిస్తోంది.

Updated Date - Jul 19 , 2024 | 05:02 AM