Share News

Banana : అరటి అదుర్స్‌..!

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:28 AM

అరటి రైతులకు కాలం కలిసొచ్చింది. ఈ ఏడాది అరటికి లభించిన ధర మరే పంటకూ దక్కలేదు. రెండునెలల వ్యవధిలోనే ధర రెండింతలైంది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రికార్డుస్థాయి ధర పలుకుతోంది. జూలైలో టన్ను రూ.15 వేల నుంచి రూ.18 వేలు పలికింది. ప్రస్తుతం రూ.26 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. దాదాపు 35 ఏళ్లుగా ఈ ధర చూడలేదని రైతులు చెబుతున్నారు. ధర నిలకడగా ఉండడం కూడా రైతులకు మేలుచేస్తోంది. ఇన్నాళ్లూ అరకొర ఆదాయం, అప్పులతో అరటిని సాగుచేసిన రైతులకు ఇన్నాళ్లకు కాలం కలిసొచ్చింది. రెండో పంటకూ ...

Banana : అరటి అదుర్స్‌..!

రెండు నెలల్లో రెట్టింపు ధర

టన్ను రూ.30 వేల వరకూ...

మహారాష్ట్రలో దెబ్బతినడమే కారణం

జనవరి వరకూ ఇదే ధర ఉంటే చాలు

గట్టెక్కుతామని అంటున్న అన్నదాతలు

తాడిపత్రి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): అరటి రైతులకు కాలం కలిసొచ్చింది. ఈ ఏడాది అరటికి లభించిన ధర మరే పంటకూ దక్కలేదు. రెండునెలల వ్యవధిలోనే ధర రెండింతలైంది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రికార్డుస్థాయి ధర పలుకుతోంది. జూలైలో టన్ను రూ.15 వేల నుంచి రూ.18 వేలు పలికింది. ప్రస్తుతం రూ.26 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. దాదాపు 35 ఏళ్లుగా ఈ ధర చూడలేదని రైతులు చెబుతున్నారు. ధర నిలకడగా ఉండడం కూడా రైతులకు మేలుచేస్తోంది. ఇన్నాళ్లూ అరకొర ఆదాయం, అప్పులతో అరటిని


సాగుచేసిన రైతులకు ఇన్నాళ్లకు కాలం కలిసొచ్చింది. రెండో పంటకూ ఊహించినదానికంటే ఎక్కువగానే ధర లభిస్తోందని రైతులు అంటున్నారు.

అక్కడ దెబ్బతినడంతో..

మహారాష్ట్ర, మధ్యప్రదేశలో అరటిపంట బాగా దెబ్బతింది. దీంతో జిల్లాలో అరటి ధర విపరీతంగా పెరిగింది. ధర, డిమాండ్‌ పెరగడానికి మహారాష్ట్రలో పంట దెబ్బతినడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితుల ప్రభావం, తెగుళ్లు తదితర కారణాల వల్ల మహారాష్ట్రలో పంట ఎక్కువశాతం దెబ్బతినింది. అరకొరగా పండిన పంట సైతం నాణ్యత లోపించడంతో వ్యాపారులు అక్కడ కొనుగోలు చేయడానికి ఇష్టపడటంలేదు. దేశంలోని వివిధ రాష్ట్రాల వ్యాపారులు తెలుగు రాష్ట్రాల్లో అరటిపై పడ్డారు. దళారుల ద్వారా ధరను నిర్ణయించి, కొనుగోలు చేసి తమ మార్కెట్లకు తరలిస్తున్నారు. తాడిపత్రి ప్రాంతం నుంచి ఎక్కువగా ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు అరటి తరలుతోంది.

6,500 వేల హెక్టార్లలో..

తాడిపత్రి ప్రాంతంలో 6,500 వేలకు పైగా హెక్టార్లలో అరటిసాగులో ఉంది. పుట్లూరు మండలంలో అత్యధికంగా 3200 హెక్టార్లలో అరటి పంట పెట్టారు. యల్లనూరు మండలంలో 1400 హెక్టార్లు, యాడికి మండలంలో 600 హెక్టార్లు, పెద్దపప్పూరు మండలంలో 1200 హెక్టార్లలో అరటి పంట సాగులో ఉంది.

నెల ఆగితే..

15 ఎకరాల్లో అరటిపంటను సాగుచేశాను. నాలుగు ఎకరాల్లో రెండో పంట చేతికి రావడానికి నెలరోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం ధర బాగా ఉంది. ఇదే ధర నెలరోజుల తర్వాత ఉంటే మాకు మేలు జరుగుతుంది. మిగిలిన 11 ఎకరాల్లో పంట జనవరికి కోతకు వస్తుంది.

- తాతిరెడ్డి దామోదర్‌రెడ్డి, ముచ్చుకోట, పెద్దపప్పూరు మండలం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 23 , 2024 | 12:28 AM