Share News

Student : సెంట్రల్‌ సిలబస్‌.. చిన్న కథ కాదు..!

ABN , Publish Date - Oct 19 , 2024 | 12:34 AM

రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన కోసం ఎంతకైనా తెగించేవారు. ఇప్పుడు బిడ్డల చదువుల కోసం అంతకు మించి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. పల్లెటూరి తల్లిదండ్రులు చెమటను కరెన్సీ మూటలుగా మార్చి కార్పొరేటు విద్యాసంస్థలకు కట్టబెడుతున్నారు. తమలాగా పిల్లలు కష్టాలు పడకూడదన్న తాపత్రయం వారిది. ఈ ఆలోచనతో ఇంటికి, ఊరికి దూరంగా.. నగరాలకు తీసుకువెళ్లి హాస్టళ్లలో వదులుతున్నారు. అక్కడ ...

Student : సెంట్రల్‌ సిలబస్‌.. చిన్న కథ కాదు..!

చదువు ఒత్తిడి భరించలేక మాయమైన విద్యార్థి

అత్తారింటికి ఆటోలో ప్రయాణం.. కథ సుఖాంతం

సినిమాకు తీసుకెళ్లి.. ఊరడించి.. బడికి చేర్చిన తండ్రి

బడికి వెళ్లాల్సిన కొడుకు.. బస్టాండులో మాయమయ్యాడు. ఏమయ్యాడో తెలియక ఆ తండ్రి ఆందోళనకు గురయ్యాడు. స్నేహితులకు, బంధువులకు ఫోన చేసి ఆరా తీశాడు. ఉబికి వస్తున్న కన్నీటిని అదిమి పట్టుకుని.. ‘నా బిడ్డకు ఏమీ కాకుండా చూడు దేవుడా..’ అని మనసులో మొక్కుకుంటూ.. వెతకడం ప్రారంభించాడు. ఆ తరువాత ఏమైంది..? ‘35.. చిన్న కథ కాదు..’ అనే సినిమా చూసే ఉంటారు కదా..? ఇంచుమించు అలాంటి కథే ఇది. అనంతపురం బస్టాండు.. అత్తారిల్లు.. సినిమా థియేటర్‌.. ఇవన్నీ దాటుకుని కర్నూలులోని ఓ బడి వరకూ సాగిన ఈ యథార్థ సంఘటనలో ఉత్కంఠ, సెంటిమెంట్‌, ఓర్పు.. నేర్పు.. అన్నీ ఉంటాయి. నేపథ్యం మాత్రం.. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎదురయ్యే చదువుల ఒత్తిళ్లు..!


అనంతపురం క్రైం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన కోసం ఎంతకైనా తెగించేవారు. ఇప్పుడు బిడ్డల చదువుల కోసం అంతకు మించి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. పల్లెటూరి తల్లిదండ్రులు చెమటను కరెన్సీ మూటలుగా మార్చి కార్పొరేటు విద్యాసంస్థలకు కట్టబెడుతున్నారు. తమలాగా పిల్లలు కష్టాలు పడకూడదన్న తాపత్రయం వారిది. ఈ ఆలోచనతో ఇంటికి, ఊరికి దూరంగా.. నగరాలకు తీసుకువెళ్లి హాస్టళ్లలో వదులుతున్నారు. అక్కడ పసివారు పడే ఇబ్బందుల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ‘వెళ్లను నాన్నా.. ఇంటి వద్దే ఉండి చదువుకుంటా..’ అని కన్నబిడ్డలు కంటతడి పెడితే.. కన్నవారు కన్నీళ్లను దాచుకుని ఊరడిస్తుంటారు. ‘బాగా చదువుకో.. భవిష్యత్తు బాగుంటుంది. నీ కోసమే కదా ఇదంతా..?’ అని నచ్చజెప్పి వస్తుంటారు. కాదూ కూడదు అంటే.. కొందరు మొరటుగా రెండు దెబ్బలు వేస్తుంటారు. గట్టిగా మందలిస్తుంటారు.

అనంతపురం నగరానికి సమీపంలో ఉన్న ఓ పల్లెటూరు వారిది. కొడుకును బాగా చదివించాలని నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి వరకు చదివించాడు. మరింత బాగా చదివించాలని గత ఏడాది 8వ తరగతికి కర్నూలులోని ఓ ప్రముఖ పాఠశాలలో చేర్పించాడు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ పిల్లవాడు దసరా పండుగకు ఇంటికొచ్చాడు. సెలవులు పూర్తి కావడంతో కొడుకును తిరిగి బడికి పంపేందుకు తండ్రి బైక్‌పై ఎక్కించుకుని శుక్రవారం అనంతపురం బస్టాండుకు వచ్చాడు. బస్సు ఇంకా రాకపోవడంతో ‘వెళ్లి టిఫిన చేసి.. వచ్చేటప్పుడు వాటర్‌ బాటిల్‌, న్యూస్‌ పేపర్‌ తీసుకురా..’ అని కొడుకును పంపించాడు తండ్రి. టిఫినకు వెళ్లిన కొడుకు అరగంట దాటినా తిరిగి రాకపోవడంతో తండ్రి కంగారుపడ్డాడు. స్నేహితులకు విషయం చెప్పి పలు ప్రాంతాల్లో గాలించాడు. అనంతపురంలో ఉంటున్న తన సోదరికి విషయం తెలియజేశాడు. ఆమె తన అపార్ట్‌మెంట్‌ వాచమెన భార్యకు సమాచారం ఇచ్చింది. ‘మా అల్లుడు వస్తే నాకు చెప్పు. నేను వెతికేందుకు వెళతా..’ అని చెప్పింది. ఈ లోగా అల్లుడు ఆటోలో నేరుగా తన అత్త ఉంటున్న అపార్ట్‌మెంట్‌ వద్ద దిగి.. అక్కడే తచ్చాడటం ప్రారంభించాడు. వాచమెన భార్య గమనించి.. ‘మీ అల్లుడొచ్చాడు..’ అని అత్తకు చెప్పింది. దీంతో వెంటనే అత్త ఆత్రంగా వచ్చి అల్లుడిని ఇంట్లోకి తీసుకెళ్లింది. సోదరుడికి సమాచారం ఇచ్చింది. అప్పటిదాకా కొడుకు ఏమయ్యాడో అని అల్లాడిపోయిన తండ్రి.. ఊపిరి పీల్చుకున్నాడు.

విషయం ఏమిటంటే..

సోదరి ఇంటికి చేరుకున్న విద్యార్థి తండ్రి.. ‘ఏమైంది నాన్నా..?’ అని అడిగాడు. ఇలా చెప్పాపెట్టకుండా మాయమైపోతే తన పరిస్థితి ఏమిటని ఆరా తీశాడు. అప్పుడు అసలు విషయం చెప్పాడు ఆ విద్యార్థి. ‘ఎనిమిదో తరగతి వరకు స్టేట్‌ సిలబస్‌ చెప్పారు. ఇప్పుడు సెంట్రల్‌ సిలబస్‌ చెబుతున్నారు. ఇబ్బందిగా ఉంది..’ అని బాధగా ముఖం పెట్టాడు. తండ్రికి విషయం అర్థమైంది. ఆవేశపడి కొడుకును తిట్టలేదు.. కొట్టలేదు. ‘అదేం పెద్ద విషయం కాదులే.. నాతో చెబితో నేను చూసుకునేటోన్ని కదా..? బడిలో మాట్లాడేవాన్ని కదా..?’ అని కొడుక్కు నచ్చజెప్పాడు. ఆ తరువాత సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా చూసే క్రమంలో.. ‘నువ్వు ఎలాగైనా చదువు. ఫస్ట్‌ రావాలని, సెకండ్‌ రావాలని లేదు. ప్రశాంతంగా చదువుకో.. పదో తరగతి పాసవ్వు చాలు. ఎలాంటి టెన్షన పడొద్దు..’ అని అనునయించాడు. సినిమా అయిపోయాక.. ‘ఇక బడికి వెళదామా..?’ అని కొడుకును అడిగాడు తండ్రి. ‘సరే.. పోదాం పద నాన్నా..’ అన్నాడు ముద్దుల కొడుకు. బస్సు ఎక్కి.. సాయంత్రానికి ఇద్దరూ కర్నూలుకు చేరుకున్నారు. కొడుకును బడిలో దించి.. వెనుదిరిగాడు తండ్రి..!


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 19 , 2024 | 12:34 AM