Handriniva : రైతన్న పరవశం..!
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:23 AM
హంద్రీనీవా కాలువకు కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిత్యం వర్షాలపైనే ఆధారపడి పంట వస్తుందో రాదోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన రైతు ఆనందంతో పరవశించిపోతున్నాడు. హంద్రీనీవా కాలువ పరిధిలో పన్నేండేళ్లలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు కాలువలో నీటిని తరలించుకుని పంటలను సాగు చేస్తున్నారు. కాలువ సమీపంలో ఉన్న పంట పొలాలన్నీ కళకళలాడుతున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, బెళుగుప్ప మండలాల్లో ఈ ఏడాది 30వేల ఎకరాలకు పైగా పంటలను సాగు చేశారు. కాలువ ..
కృష్ణమ్మ పరవళ్లు.. పచ్చగా పంటలు..
గణనీయంగా పెరిగిన సాగు
ఉరవకొండ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కాలువకు కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిత్యం వర్షాలపైనే ఆధారపడి పంట వస్తుందో రాదోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన రైతు ఆనందంతో పరవశించిపోతున్నాడు. హంద్రీనీవా కాలువ పరిధిలో పన్నేండేళ్లలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు కాలువలో నీటిని తరలించుకుని పంటలను సాగు చేస్తున్నారు. కాలువ సమీపంలో ఉన్న పంట పొలాలన్నీ కళకళలాడుతున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, బెళుగుప్ప మండలాల్లో ఈ ఏడాది 30వేల ఎకరాలకు పైగా పంటలను సాగు చేశారు. కాలువ కింద ప్రధానంగా మిరప, కంది, వేరుశనగ, పప్పుశనగ పంటలు వేశారు. ఈ ఏడాది
కాలువకు జూలై నెలలోనే నీరు విడుదల చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో శ్రీశైలం డ్యాంలో కూడా నీరు పుష్కలంగా ఉంది. మార్చి దాకా నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలువ సమీపంలో ఉన్న రైతులు విద్యుత మోటార్లను ఏర్పాటు చేసుకుని నీటిని తరలించుకుంటున్నారు. కాలువ వెళ్లే గ్రామాల పరిధిలోని రైతులు ఐదారు కిలో మీటర్ల వరకూ పైపులైన్లు వేసుకున్నారు. వీటి ద్వారా నీటిని పొలాలకు వదులుకుని పంటలను సాగు చేస్తున్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రెండేళ్ల నుంచి కాలువ పరిధిలో పంటలు సరిగ్గా పండలేదు. గత ఏడాది పంటలు చేతికొచ్చే దశలో నీటిని నిలిపివేయడంతో రైతులతో పాటు అప్పటి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రైతుల పక్షాన పోరాడి నీటి విడుదలకు కృషిచేశారు. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పాటు, కృష్ణా జలాలను తరలించడంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడంతో హంద్రీనీవా కాలువ ఆధునికరణకు శ్రీకారం చుట్టడంతో హంద్రీనీవా రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే 33వ ప్యాకేజీలో డీ1, డీ2 డిస్ర్టిబ్యూటర్లకు సాగునీటిని అందిస్తున్నారు. హంద్రీనీవా డిస్ర్టిబ్యూటరీ పనులు పూర్తయితే ఉరవకొండ నియోజకవర్గంలోనే 70వేల ఎకరాల ఆయకట్టు సాగులోనికి వస్తుంది.
కేశవ్ ప్రత్యేక చొరవ
హంద్రీనీవా కాలువకు 12 ఏళ్ల నుంచి నీరు పారుతోంది. డిస్ర్టిబ్యూటరీ పనులు పూర్తి కాకపోవడంతో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి పయ్యావుల కేశవ్ కాలువలో నీటిని తోడుకోవడానికి అధికారులను ఒప్పించారు. కేశవ్ చొరవతో నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ పరిధిలో గణనీయంగా సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రక్క మండలాలకు చెందిన రైతులు కాలువ సమీపంలోని పొలాలను గుత్తకు తీసుకుని, విద్యుత, డీజిల్ మోటార్ల ద్వారా నీటిని తోడుకుని పంటలను సాగు చేస్తున్నారు.
కౌలుకు తీసుకుని సాగు చేశా
కౌలుకు తీసుకుని రెండేళ్ల నుంచి పంటలు సాగు చేస్తున్నా. కాలువ పరిధిలో పొలాలకు మంచి డిమాండ్ ఉంది. ఎకరాకు రూ.40వేల దాకా కౌలు చెల్లిస్తున్నాం. ప్రస్తుతం మిర్చి పంట సాగు చేశా. కాలువకు మార్చి దాకా నీళ్లు వస్తే, రెండు పంటలు పండించుకునే అవకాశముంటుంది.
- రాము, వేల్పుమడుగు
మూడు కిలోమీటర్లు పైపు లైన వేశా
హంద్రీనీవా కాలువ నుంచి మూడు కిలోమీటర్లు పైపు లైన్లు ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేస్తున్నా. ఏడేళ్ల క్రితం పైపులైన ఏర్పాటు చేశా. రూ.మూడు లక్షల దాకా ఖర్చు పెట్టా. ప్రతి యేటా కాలువ ద్వారా నీటిని తోడుకుని పంటలు పండిస్తున్నా. డిస్ర్టిబ్యూటరీ పనులు పూర్తి చేసి సాగు నీరు అందిస్తే బాగుంటుంది.
- వశికేరప్ప, రాగులపాడు
మరిన్ని అనంతపురం వార్తల కోసం....