Share News

Crime : గ్యాంగ్‌రేప్‌ కేసులో ఐదుగురి అరెస్టు

ABN , Publish Date - Oct 16 , 2024 | 12:13 AM

అత్త, కోడలిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. హిందూపురం డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న మిల్లులో వాచమెనగా పనిచేస్తున్న కుటుంబంలో అత్తాకోడలిపై ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దుండగులను ...

Crime : గ్యాంగ్‌రేప్‌ కేసులో ఐదుగురి అరెస్టు
SP Ratna revealing the details of the arrest of the accused

పట్టుబడిన వారిలో ఇద్దరు పాత నేరస్థులు, ముగ్గురు మైనర్లు

హిందూపురం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): అత్త, కోడలిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. హిందూపురం డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న మిల్లులో వాచమెనగా పనిచేస్తున్న కుటుంబంలో అత్తాకోడలిపై ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దుండగులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. డీఎస్పీ మహేష్‌ ఆధ్వర్యంలో సీఐలు ఆంజనేయులు, కరీం, రాఘవన, జనార్దన ఈ కేసు దర్యాప్తు చేపట్టారనీ, నిందితుల్లో ఐదుగురిని హిందూపురం డంపింగ్‌ యార్డ్‌ వద్ద మంగళవారం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. తమ విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. హిందూపురం పట్టణంలోని త్యాగరాజ్‌ నగర్‌కు చెందిన మోస్ట్‌వాంటెండ్‌ క్రిమినల్‌, అంతర్రాష్ట్ర దొంగ ఎరుకల కావడి నాగేంద్ర అలియాస్‌ నాగ, అలియాస్‌ రోబో, అదే ప్రాంతానికి చెందిన సాకే ప్రవీణ్‌కుమార్‌, ముగ్గురు మైనర్లను అరెస్టు చేశామని తెలిపారు. ఎరుకల నాగేంద్ర, సాకే ప్రవీణ్‌కుమార్‌, పరారీలో ఉన్న చాకలి శ్రీనివాస్‌ పాత నేరస్థులని తెలిపారు. నాగేంద్ర 37 కేసుల్లో నిందితుడనీ, మరో 30కిపైగా కేసులను కోర్టు కొట్టివేసిందని తెలిపారు. సాకే ప్రవీణ్‌ కుమార్‌పై లేపాక్షి పోలీస్‌ స్టేషన పరిధిలో హత్య కేసు ఉందనీ, పరారీలో ఉన్న మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ చాకలి శ్రీనివాసులుపై హిందూపురం రూరల్‌ పోలీసు స్టేషనలో దోపిడీ కేసు ఉందని తెలిపారు. నిందితులు ఆరుగురు రెండు ద్విచక్రవాహనాల్లో చోరీ కోసం వెళ్లారని, అప్పటికే మిల్లు వద్ద వాచమనగా ఉంటున్న కర్ణాటక కుటుంబంపై కన్నేశారని ఎస్పీ తెలిపారు. రెండు, మూడుసార్లు రెక్కీ నిర్వహించారని, ఈనెల 11న అర్ధరాత్రి దాటాక అక్కడికి వెళ్లి ద్విచక్ర వాహనాలు ఆపారని, కుక్కలు మొరగడంతో వాచమన టార్చ్‌లైట్‌ వేసి చూశారని తెలిపారు. అతని వద్దకు వెళ్లి ఉద్దేశపూర్వకంగా తాగునీరు అడిగారనీ, ముందుకు వస్తున్న వారిని వాచమన


అడ్డుకున్నాడని తెలిపారు. అరుపులు విని భార్య, కుమారుడు, కోడలు బయటకు వచ్చారన్నారు. తండ్రీకొడుకుల వద్ద నిందితుల్లో ఇద్దరు కాపలా ఉండి, అత్తాకోడలిని మిగతావారు రేకుల షెడ్‌లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు.

సీఎం సీరియస్‌ కావడంతో..

సామూహిక అత్యాచార ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియ్‌సగా పరిగణించడంతో ఎస్పీ రత్న స్వయంగా రంగంలోకి దిగారు. నేరం జరిగిన ప్రాంతం సమీపంలో రెండురోజులపాటు మకాం వేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగుల ముఖచిత్రాలు గుర్తించి, 48 గంటల్లోపే కేసును ఛేదించారు. నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితులు గతంలో పలుప్రాంతాల్లో దారిదోపిడీలు, చోరీలు చేశారని, ఆ సమయాల్లో ఒంటరిగా వెళ్లే జంటలపై నిఘావేసి అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న చాకలి శ్రీనివాసులు.. మహిళలపై అత్యాచారాలకు మాత్రమే పాల్పడేవాడన్నారు. మహిళలను చాలా ఇబ్బందులు పెట్టేవాడని తమ విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. అతడిని త్వరలో పట్టుకుంటామని అన్నారు. అత్తాకోడలిపై గ్యాంగ్‌రేప్‌ అనంతరం వారి వద్ద ఉన్న రూ.5200 నగదు ఎత్తుకెళ్లారని తెలిపారు. ఆ నగదుతోపాటు వారు వినియోగించిన రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐలు ఆంజనేయులు, కరీం, రాఘవన, జనార్దన, సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ మహేష్‌, సీఐలు రాజగోపాల్‌నాయుడు, ఆంజనేయులు, జనార్దన, అబ్దుల్‌ కరీం పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 16 , 2024 | 12:13 AM