Share News

MEO : శ్రుతిమించిన చేతివాటం..!

ABN , Publish Date - Sep 18 , 2024 | 12:39 AM

చేతి వాటం శ్రుతిమించింది. కొందరు మండల విద్యాశాఖాధికారు(ఎంఈఓ)లు ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లనే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లను సైతం టార్గెట్‌ చేసి దోచేస్తున్నారు. కొందరు ఎంఈఓలు.. విజిట్లు చేసి, బెదిరిస్తూ... డబ్బు గుంజుతున్నారు. మరికొందరు.. ఉపాధ్యాయ సంఘాలను తమ చేతుల్లో పెట్టుకుని టీచర్లను టార్గెట్‌ చేసి, చర్యలు తీసుకుంటామంటూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ...

MEO : శ్రుతిమించిన చేతివాటం..!
Kooderu MEO Office

కొందరు ఎంఈఓల వసూళ్ల బాగోతం

ఏళ్లుగా ఒకేచోట ఉద్యోగం

రూ.కోట్లకు పడగలెత్తిన వైనం

అనంతపురం విద్య, సెప్టెంబరు 17: చేతి వాటం శ్రుతిమించింది. కొందరు మండల విద్యాశాఖాధికారు(ఎంఈఓ)లు ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లనే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లను సైతం టార్గెట్‌ చేసి దోచేస్తున్నారు. కొందరు ఎంఈఓలు.. విజిట్లు చేసి, బెదిరిస్తూ... డబ్బు గుంజుతున్నారు. మరికొందరు.. ఉపాధ్యాయ సంఘాలను తమ చేతుల్లో పెట్టుకుని టీచర్లను టార్గెట్‌ చేసి, చర్యలు తీసుకుంటామంటూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పైవేటు, ప్రభుత్వ పాఠశాలలను ఆదాయ వనరులుగా మార్చుకుని, డబ్బు గుంజుతున్న ఎంఈఓలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కోకొళ్లలు. చాలామంది ఎంఈఓలు ఏడేళ్లుగా, మరికొందరు 12 ఏళ్లుగా స్థానికంగా ఉండటమే ఇందుకు


బలం చేకూరుస్తోంది. అనేకమంది అక్రమ వసూళ్లకు తెరతీసి రూ.కోట్లకు పడగలెత్తారు. కూడేరు ఎంఈఓ చంద్రశేఖర్‌ను ఏసీబీ అధికారులు ట్రాప్‌ చేశారు. ఈ క్రమంలో చాలామంది ఎంఈఓలు ఇదే వ్యవహారాల్లో తలమునకలవడంతో ఏసీబీ మరింత లోతైన దర్యాప్తు చేస్తే... మరికొందరు ఏసీబీ వలలో చిక్కడం ఖాయం అన్న చర్చ నడుస్తోంది.

వసూళ్లకు రెండువైపులా పదును

ప్రైవేట్‌, ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లు సాగిస్తున్నారు పలువురు ఎంఈఓలు. పలువురు ఎంఈఓలు.. కొందరు ఉపాధ్యాయులను స్కూళ్లకు పంపకుండా ఎమ్మార్సీల్లోనే ఉంచుకుంటున్నారు. గ్యాంగ్‌ను వెంటేసుకుని, కొంద రు స్కూళ్ల విజిట్‌కు వెళ్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి. తమ కనుసన్నల్లో నడిచే టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కొందరు టీచర్ల లోపాలు గుర్తిస్తారు. తన అనుయాయ టీచర్ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు స్కూళ్లు విజిట్‌ చేస్తారు. ధూం...ధాం... అంటారు. సీరియస్‌ యాక్షన అంటూ హెచ్చరిస్తారు. తర్వాత తన అనుచర టీచర్ల ద్వారా బేరసారాలకు దిగుతారు. ‘సార్‌..... చర్యలు తీసుకోకుండా నేను మాట్లాడుతాను... నేను చెప్పింది సర్దుబాటు చేయ్‌’’ అంటూ అనుయాయ టీచర్లు పావులు కదుపుతారు. అనుకున్న పైకం ఎంఈఓకు చేరగానే...ఇక ఏం చర్యలు ఉండవు. అదేవిధంగా సర్దుబాటు, బదిలీలు, నాడు-నేడు పనుల్లో సైతం వాటాలు లాగేస్తారు. అదేవిధంగా ప్రైవేట్‌ స్కూళ్ల ఇలా ప్రభుత్వ స్కూళ్ల విషయం ఇక చెప్పనక్కరలేదు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లకు అనుమతులు, గుర్తింపు, రెన్యూవల్‌ పేరు చొప్పి ఇబ్బంది ముబ్బడిగా పిండుకుంటున్నారు. రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలు, రూ. 3 లక్షలు ఇలా ఎంత పడితే అంత లాగేస్తున్నారు. డీఈఓ ఆపీస్‌, ఆర్‌జేడీ ఆఫీ్‌సలోని అధికారుల పేర్లు చొప్పి కూడా కొందరు ఎంఈఓలు శ్రుతిమించి వసూళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూడేరు ఎంఈఓ చంద్రశేఖర్‌ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం అందుకు దర్పణం పడుతోంది. ఇలా చాలా మందే ఉన్నారు.

బదిలీ కాకపోవడమే బరితెగింపునకు బలం..

మండలాల్లో చాలా మంది ఎంఈఓలు ఏళ్ల తరబడి బదిలీ కాకుండా స్థానికంగానే తిష్టవేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మెజార్టీ ఎంఈఓలు 7 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకూ బదిలీకాకుండా మండలాల్లోనే పాతుకుపోయారు. రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు చేపట్టకపోవడం వారికి కలిసొస్తోంది. ఉన్న మండలాల్లోనే తిష్టవేసుకుని, స్థానికంగా పట్టు సాధించారు. వీళ్లకు బదిలీలు నిర్వహించకపోవంతోనే భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఈనెల 2న ‘వీళ్లకు బదిలీలు లేవా’ శీర్షికన ఆంరఽధజ్యోతి కథనం ప్రచురించింది. ఒకవైపు ఉపాధ్యాయులు, మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ల కరస్పాండెంట్ల నుంచి ఎంఈఓల బదిలీలకు బలంగా డిమాండ్‌ చేస్తున్నారు. కూడేరు ఎంఈఓ చంద్రశేఖర్‌ 7 ఏళ్లకుపైగా స్థానికంగా ఉన్నారు. 2017 నుంచి కూడేరులో ఉన్నట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ బలంతోనే ప్రైవేటు స్కూళ్లలో వసూళ్లకు తెరతీసి అడ్డంగా ఏసీబీకి చిక్కారు. రెండు చేతులా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ కొందరు ఎంఈఓలు రూ.కోట్లకు పడగలెత్తారు. ఏసీబీ మరింత దృష్టి సారిస్తే... మరిన్ని అవినీతి తిమింగలాలు బయట పడే అవకాశం ఉందన్న చర్చ విద్యాశాఖలో సాగుతోంది.

ఏసీబీ వలలో ఎంఈఓ

కూడేరు సెప్టెంబరు 17: అనంతపురం జిల్లా కూడేరు మండల విద్యాధికారి (ఎంఈఓ)-1 చంద్రశేఖర్‌ ఏసీబీ వలలో చిక్కాడు. అనంతపురం నగర శివారులోని ఏపీఐఐసీ కార్యాలయం వద్ద విరిడియన ఎకోలి స్కూల్‌లో పనిచేస్తున్న సిబ్బంది సాగర్‌ నుంచి మంగళవారం సాయం త్రం రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అనంతపురం ఇనచార్జి డీఎస్పీ జెస్సీ ప్రశాంతి ఆ వివరాలు వెల్లడించారు. కూడేరు మండలం ముష్టూరు గ్రామ సమీపాన ఉన్న విరిడియన ఎకోలి పాఠశాల తనిఖీ సమయంలో తనకు రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని ఎంఈఓ చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశాడు. లేదంటే పాఠశాలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి నివేదికలు పంపుతానని బెదిరించాడు. దీంతో పాఠశాల యాజమా న్యం.. ఏసీబీని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో అనంతపురం నగర శివారులోని ఏపీఐఐసీ కార్యాలయం వద్ద పాఠశాల సిబ్బంది నుంచి ఎంఈఓ రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీతోపాటు సీఐలు కృష్ణారెడ్డి, మోహనకృష్ణ.. సిబ్బందితో కలిసి దాడి చేసి, పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకున్నారు. పాఠశాలలో పనిచేస్తున్న సాగర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 18 , 2024 | 12:39 AM