Share News

Rain : వాన కష్టం..!

ABN , Publish Date - Oct 18 , 2024 | 12:07 AM

రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. సాగు చేసిన పంట చేతికందే వరకు కష్టంగా మారుతోంది. ఓవైపు చీడపురుగులు, రోగాలు మరోవైపు ప్రకృతి వైఫరీత్యాలు రైతన్నల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవలిగా కురుస్తున్న భారీ వర్షాలు రైతుల కంట నీరు తెప్పిస్తున్నాయి. ఖరీ్‌ఫలో బోర్లు, వర్షాధారంగా సాగుచేసిన పంటలు కోతకు వచ్చాయి. ప్రస్తుతం భారీ వర్షాలతో పండిన పంటను ఇంటికి తెచ్చుకోలేకపోతున్నారు. చేనులోనే పంటలు నీట మునుగుతున్నాయి. కోసిన పంటను నూర్పిడి చేసుకోలేక, ఆరబెట్టుకోలేక ...

Rain : వాన కష్టం..!
Farmers dried corn after the rain subsided

కోసిన పంటలను కాపాడుకునేందుకు రైతుల తంటాలు

వర్షానికి తడిస్తే ధాన్యం పాడైపోయే ప్రమాదం

సర్వం నష్టపోతామంటున్న రైతులు

చిలమత్తూరు, ఆక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. సాగు చేసిన పంట చేతికందే వరకు కష్టంగా మారుతోంది. ఓవైపు చీడపురుగులు, రోగాలు మరోవైపు ప్రకృతి వైఫరీత్యాలు రైతన్నల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవలిగా కురుస్తున్న భారీ వర్షాలు రైతుల కంట నీరు తెప్పిస్తున్నాయి. ఖరీ్‌ఫలో బోర్లు, వర్షాధారంగా సాగుచేసిన పంటలు కోతకు వచ్చాయి. ప్రస్తుతం భారీ వర్షాలతో పండిన పంటను ఇంటికి తెచ్చుకోలేకపోతున్నారు. చేనులోనే పంటలు నీట మునుగుతున్నాయి. కోసిన పంటను నూర్పిడి చేసుకోలేక, ఆరబెట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు.

ఇంటికి తీసుకెళ్లడం గగనమే..

మండలంలో అత్యధికంగా మొక్కజొన్న, వేరుశనగ పంటలు సాగయ్యాయి. వేరుశనగ పంటను ఇప్పటికే తొలగించగా.. బోర్లుకింద సాగైన మొక్కజొన్న పంటను కోశారు. నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తొలగించిన వేరుశనగ పంట తడిసి ముద్దయింది. కాయలను కోసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏదోరకంగా కోసిన కాయలను ఆరబెట్టుకోవడానికి తల ప్రాణం తోకకు వస్తోంది. మొక్కజొన్న విషయానికి వస్తే కోసిన కంకెలను పచ్చిగా ఉన్నట్లే యంత్రాలతో నూర్పిడి చేసుకుంటున్నారు. గింజలు పచ్చిగా ఉండటంతో వాటిని ఆరబెట్టుకోవడం కష్టంగా మారింది. రోజూ వర్షం


కురుస్తుండటంతో గింజలు ఆరడం లేదని రైతులు వాపోతున్నారు.

తడుస్తున్న ధాన్యం

వారం రోజులుగా జడివాన కురుస్తోంది. దీంతో నూర్పిడి చేసుకున్న ధాన్యం ఆరబెట్టుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూర్పిడి చేసిన మొక్కజొన్నలు, వేరుశనగ కాయలను ఆరబెట్టుకునేందుకు ఇద్దరు వ్యక్తులు దగ్గరే ఉండాల్సి వస్తోంది. ఏ సమయంలో వర్షం వస్తుందో పాలిథిన కవర్‌ను సిద్ధంగా పెట్టుకుంటున్నారు. రోజులో నాలుగైదు సార్లు చిరుజల్లులు పడి ఆగిపోతుండడంతో ప్రతిసారీ ధాన్యం కుప్ప తోయడం, వర్షం ఆగిన తరువాత దానిని విడదీయడం చేస్తున్నారు. దీంతో పక్కకు కూడా వెళ్లలేని పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. వర్షానికి ధాన్యం తడవడం ఖాయం. అదే జరిగితే ఆరుగాళం కష్టపడి పండించిన పంట నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. పంట దిగుబడి తడిసిపోతే నాణ్యత తగ్గిపోతుంది. అలాంటి ధాన్యం ధర పడిపోతుందనీ, వ్యాపారులు కొనేందుకు ఆసక్తి చూపరని రైతులు చెబుతున్నారు. ధాన్యం నాణ్యత పూర్తిగా దెబ్బతినడం వలన అమ్మకోలేని పరిస్థితి వస్తుందని అంటున్నారు.

నూర్పిడి యంత్రాలు, కల్లాలు లేక..

పండించిన పంటను చివరి దశలో నూర్పిడి చేసుకుని, నాణ్యత కోల్పోకుండా భధ్రపరచుకుంటేనే మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ఆ అవకాశాలు ఇక్కడి రైతులకు లేకపోవడం శోచనీయం. వేరుశనగ, వరి, మొక్కజొన్న వంటి పంటలను నూర్పిడి చేసుకోవడానికి యంత్రాలు అందుబాటులో లేవు. దాంతో సకాలంలో పంటను నూర్పిడి చేసుకోలేకపోతున్నారు. నూర్పిడి చేసుకున్న పంటను కూడా సక్రమంగా ఆరబెట్టుకోవడానికి అనుకూలమైన ధాన్యం కల్లాలు లేవు. దాంతో పండించిన ధాన్యాన్ని రోడ్లు పాలు చేసుకుంటున్నారు. వర్షం వచ్చినపుడు సకాలంలో భద్రపరచుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తరుణంలో ఆరుగాళం కష్టపడిన పంటను ఇంటికి తీసుకెళ్లేవరకు రైతులకు భరోసా లేకుండా పోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని, రైతులకు ప్రభుత్వం ధాన్యం నూర్పిడి యంత్రాలు, కల్లాలను సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పంటను కాపాడుకోవడం కష్టమైంది

పండించిన పంటను ఇంటికి తీసుకెళ్లి ఆరబెట్టి భద్రపరచుకోవడం కష్టంగా మారుతోంది. గ్రామంలో ధాన్యం ఆరబెట్టుకోవడానికి కల్లాలు లేవు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి వచ్చి ఆరబెట్టుకుంటున్నాం. వర్షం గంటకోసారి ఆగుతూ కురుస్తోంది. దీంతో ధాన్యం కుప్పనూకడం, మళ్లీ ఆరబెట్టడం పనిగా మారింది.

-ఆనందరెడ్డి, రైతు, పలగలపల్లి

ఆరడంలేదు..

రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశా. వారంరోజుల క్రితం పంటను కోసి, ఇంటికి తీసుకొచ్చా. అప్పట్నుంచి కాయ, కట్టి ఆరడం లేదు. దాంతో చెట్లలో కాయలు నల్లబారుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కాయకట్టిని భద్రపరచుకోవడం కష్టమవుతోంది. ఇలాగే వర్షం కురిస్తే కాయలు మొలకలు వస్తాయి.

-బయపరెడ్డి, రైతు, కోట్లోపల్లి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 18 , 2024 | 12:07 AM