Share News

Journalist Rally: అనంతలో ‘నిర్బంధం’ మధ్యే జర్నలిస్టుల ర్యాలీ

ABN , Publish Date - Feb 22 , 2024 | 12:57 PM

Andhrapradesh: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడికి నిరసనగా ‘‘ఛలో అనంత’’కు ఏపీయూడబ్ల్యూజే పిలుపునిచ్చింది. అయితే ఏపీయూడబ్ల్యూజే 'చలో అనంత'పై పోలీసులు నిర్బంధం విధించారు. ఈ కార్యక్రమానికి బయలుదేరిన జర్నలిస్టులను ఎక్కడికక్కడ అణచివేసి... స్టేషన్లకు తరలించారు. అయితే పోలీసుల నిర్బంధం మధ్యే జిల్లాలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఏపీయుడబ్ల్యూజే, జర్నలిస్టులు శాంతి ర్యాలీ చేపట్టారు.

Journalist Rally: అనంతలో ‘నిర్బంధం’ మధ్యే జర్నలిస్టుల ర్యాలీ

అనంతపురం, ఫిబ్రవరి 22: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై (ABN-Andhrajyothy) దాడికి నిరసనగా ‘‘ఛలో అనంత’’కు ఏపీయూడబ్ల్యూజే (APUWJ) పిలుపునిచ్చింది. అయితే ఏపీయూడబ్ల్యూజే 'చలో అనంత'పై పోలీసులు నిర్బంధం విధించారు. ఈ కార్యక్రమానికి బయలుదేరిన జర్నలిస్టులను (Journalist) ఎక్కడికక్కడ అణచివేసి... స్టేషన్లకు తరలించారు. అయితే పోలీసుల నిర్బంధం మధ్యే జిల్లాలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఏపీయుడబ్ల్యూజే, జర్నలిస్టులు శాంతి ర్యాలీ చేపట్టారు. పత్రికా స్వేచ్ఛను కాపాడండి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని నినాదాలు చేశారు. జర్నలిస్టులపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులు రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు.

ఏం రాసినా కేసులే: ఐవీ సుబ్బారావు

శాంతి ర్యాలీలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ... మూడు నాలుగు సంవత్సరాలకు రాష్ట్రంలో భయానకరమైన పరిస్థితి ఏర్పడ్డాయన్నారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే జర్నలిస్టులకు మేలు జరుగుతుందని భావించామని తెలిపారు. రక్షణగా ఉంటానని చెప్పి మీడియా స్వేచ్ఛను హరించే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాలపై వార్తలు రాస్తున్నారంటూ జర్నలిస్టులపై కేసులు బనాయించారన్నారు. నాడు - నేడు పనులు పాఠశాలలో విద్యార్థుల ఇబ్బందులపై వార్తలు రాస్తే కేసులు పెట్టారన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్టులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. మీడియాను కంట్రోల్ చేసే వ్యూహంలో ఆమరావతి నుంచి బ్యాగులు పంపిస్తున్నారని ఆరోపించారు. భయభ్రాంతులకు గురి చేయడం కోసం దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో మీడియాపై జరుగుతున్న దాడులపై దేశ వ్యాప్తంగా ఐక్య పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఆ పత్రికలో జర్నలిస్టులకు స్వేచ్ఛ నిల్!

సాక్షి పత్రిక ఛానల్లో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదని... జగన్ ఫోటో, వీడియో బాగా రాకుంటే ఉద్యోగం నుంచి తొలగించారని విమర్శలు గుప్పించారు. శ్రీకృష్ణపై జరిగిన దాడికి వ్యతిరేకంగా ప్రజా మద్దతును చూశామన్నారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘‘సిద్ధం’’ పేరుతో పత్రికలను తిట్టడంతోనే జర్నలిస్టులపై దాడులు చేశారన్నారు. మానవత్వం లేకుండా భయపెట్టి పాలన సాగిస్తున్నారన్నారు. పోలీసుల పరువును కాపాడాల్సిన బాధ్యత డీజీపీదే అని.. ఇంత ఘటన జరిగితే డీజీపీ ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు. ముఖ్యమంత్రి మనస్తత్వం వేరని... ప్రజలు తిరుగుబాటు చేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మీడియాపై దాడి జరిగితే హత్యాయత్నం కేసులు బనాయించాలన్నారు. జర్నలిస్టులకు క్షమాపణ చెప్పకపోతే తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామన్నారు. ప్యాలెస్‌ను చుట్టూముట్టే వరకు తీసుకురావొద్దని... ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చూపిస్తామంటూ ఐవీ సుబ్బారావు హెచ్చరించారు.

Updated Date - Feb 22 , 2024 | 01:00 PM