AP ELECTIONS POSTAL BALLOT : ఏదో జరుగుతోంది..!
ABN , Publish Date - May 04 , 2024 | 11:41 PM
ఉమ్మడి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ చుట్టూ కుట్రలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తగ్గించేందుకు వ్యూహాత్మకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఓటింగ్‌కు దూరం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసిన తర్వాత ఉత్తర్వులు ఇవ్వడం, పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగం ఎక్కడన్న దానిపై ఓటింగ్ రోజు వరకూ స్పష్టత ఇవ్వకపోవడం, ఫెసిలిటేషన సెంటర్లకు మధ్యాహ్నం 3 గంటలైనా బ్యాలెట్ పేపర్లు సరఫరా కాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ...
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చుట్టూ కుట్రలు
అధికార పార్టీకి వ్యతిరేక ఓట్లు తగ్గించే యత్నం..?
అంతర్ జిల్లా పోస్టల్ ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు
టీటీడీసీ, డ్వామా వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల ఆందోళన
పోలింగ్ జాప్యం.. రెండోరోజు కొనసాగిన అధికారుల నిర్లక్ష్యం
ఇదీ పరిస్థితి..
బొలిగుండ్ల చంద్రశేఖర్.. నార్పల మండలం పి.బండ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచఎంగా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 5న బుక్కరాయసముద్రం లో జరిగిన ఎన్నికల శిక్షణ కేంద్రంలో ఆర్‌ఓకు ఫారం-12 ఇచ్చారు. అనంతపురం ఆర్వోకు అక్కడి నుంచి దరఖాస్తు చేరాలి. ఓటు వేయడానికి శనివారం వెళితే.. జాబితాలో పేరు కనిపించలేదు.
అనంతపురం నగరంలోని శారదా నగరపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయని భాగ్యలక్ష్మి.. అనంతపురం రూరల్‌లో నివాసం ఉంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12ను అధికారులకు అందజేశారు. ఓటు వేయడానికి పంగల్ రోడ్డు వద్ద ఉన్న టీటీడీసీ సెంటర్‌కు వెళ్లగా.. జాబితాలో పేరు కనిపించలేదు. అధికారులను అడిగినా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆమె వెనుదిరిగారు.
అనంతపురం కేఎస్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న కేసీ పద్మ, వేదవతి, రవికుమార్.. ఇలా ఆ పాఠశాల టీచర్లు ఎనిమిది మంది డీఆర్‌డీఏ కార్యాలయంలోని ఫెసిలిటీ సెంటర్‌లో పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12 దరఖాస్తులు ఇచ్చారు. ఓటువేయడానికి టీటీడీసీకి వెళ్లారు. జాబితాలో వారి పేర్లు కనిపించలేదు. డీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చి.. తామిచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని అడిగారు. ఇక్కడి అధికారులు తమకు సంబంధం లేదని అన్నారు.
బుక్కరాయసముద్రంలోని ఎనజీ రంగా యూనివర్శిటీలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రాజగోపాల్ నాలుగు నెలల క్రితం మడకశిరకు బదిలీ అయ్యారు. ఆయనకు అనంతపురం జిల్లాలో ఎన్నికల డ్యూటీకి వేశారు. ఆర్డర్ కాపీని ఈ నెల 2న ఆయన వాట్సాప్‌కు పంపించారు. ఆయనకు అనంతపురంలో ఓటు ఉంది. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుందామంటే.. ఈ నెల ఒకటో తేదీకే గడువు ముగిసింది. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో ఓటు వేయడం సాధ్యామయ్యేలా కనిపించడం లేదు. ఇలాంటోళ్లు మరో నలుగురు ఉన్నారని సమాచారం.
అనంతపురం విద్య/టౌన, మే 4: ఉమ్మడి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ చుట్టూ కుట్రలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తగ్గించేందుకు వ్యూహాత్మకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఓటింగ్‌కు దూరం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసిన తర్వాత ఉత్తర్వులు ఇవ్వడం, పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగం ఎక్కడన్న దానిపై ఓటింగ్ రోజు వరకూ స్పష్టత ఇవ్వకపోవడం, ఫెసిలిటేషన సెంటర్లకు మధ్యాహ్నం 3 గంటలైనా బ్యాలెట్ పేపర్లు సరఫరా కాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ఆర్వోలకూ సమాచారం లేదు..
అనంతపురం జిల్లాలో ఓటు ఉండి.. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎక్కడ ఓటు వేయాలి...? ఇతర జిల్లాల్లో పనిచేస్తూ.. అనంతపురం జిల్లాలో ఓటు ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎక్కడ ఓటు వేయాలి అన్నదానిపై ఎన్నికల అధికారుల వద్ద స్పష్టత లేదు. పోస్టల్ ఓటర్లకు ఆర్వోలు క్లారిటీ ఇవ్వడం లేదు. ఓటు ఉన్న జిల్లాలోనే ఓటు వేయాలా...? లేక పనిచేస్తున్న జిల్లాలోనే ఓటు వేయాలా అన్న అనుమానాలను నివృత్తి చేయలేదు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు తీవ్ర గందగరోళానికి గురవుతున్నారు. ఫెసిలిటేషన సెంటర్ల వద్ద ఎన్నికల విధుల్లో ఉన్నవారిని అడిగినా స్పష్టత ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆఖరికి రిటన్నింగ్ ఆఫీసర్ల వద్దకు వెళ్లినా స్పష్టమైన సమాచారం లేదని అంటున్నారు.
ఉద్యోగులు.. ఉపాధ్యాయుల ఆందోళన
అంతర్ జిల్లాల సోస్టల్ బ్యాలెట్ ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతయ్యాయి. దీంతో కదిరి, ధర్మవరం నియోజకవర్గాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు, ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన దాదాపు 150 మందికి రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికల విధులను కేటాయించారు. అనంతపురం శివారులోని టీటీడీసీలో ఎన్నికల శిక్షణకు హాజరైన వీరందరూ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు శనివారం ప్రయత్నించారు. కానీ టీటీడీసీ ఫెసిలిటేషన కేంద్రంలో వారి ఓట్లు లేవని చెప్పడంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు. ఓటరు జాబితా పరిశీలించడానికి అందరినీ నగరంలోని డ్వామా కార్యాలయానికి రప్పించారు. అక్కడున్న అంతర్ జిల్లా ఓటర్ల జాబితాలో కూడా వీరి పేర్లు కనిపించలేదు. దీంతో మళ్లీ డ్వామా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో తప్పు ఎక్కడ జరిగిందోనని కలెక్టర్ ఆరా తీశారు. శ్రీసత్యసాయి జిల్లాకు వారి జాబితా పంపినట్లు తేలడంతో అక్కడ బ్యాలెట్ ఇస్తారని కలెక్టర్ సూచించారు. దీనిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము రాప్తాడు శిక్షణ కేంద్రంలో ఫారం-12 ఇచ్చామని, అక్కడ అడిగితే అనంతపురం జిల్లాలోనే ఓటు వేయాలని సూచించారని తెలిపారు. ఇప్పుడు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లమంటే ఎలా అని ప్రశినంచారు. దీంతో కలెక్టరు వినోద్ కుమార్.. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరు అరుణ్ బాబుతో ఫోనలో మాట్లాడారు. రెండు నియోజకవర్గాల ఓటర్లకు అవకాశం కల్పిస్తామని కలెక్టర్ అరుణ్ బాబు చెప్పడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు శాంతించారు.
అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
అంతర్ జిల్లా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ అనంతపురం జిల్లాలో సాయంత్రం 5 గంటలైనా మొదలు పెట్టలేదు. విషయం తెలుసుకున్న కలెక్టరు వినోద్ కుమార్ సంబంధిత అదికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన కొందరు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు డ్వామా మీటింగ్ హాల్‌లో అప్పటికప్పుడు ఓటింగ్ సౌకర్యం కల్పించారు. అప్పటికే చాలామంది వెళ్లిపోవడంతో పదిమంది మాత్రమే ఓటు వేయగలిగారు.
ఓటుకు నోట్లు..
అనంతపురం నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వైసీపీ నాయకులు, ఆ పార్టీకి అనుకూలమైన కొందరు సంఘాల నాయకులు బరితెగించి వ్యవహరించారు. ఓ చెట్టుకింద నిలబడి.. ఓటు వేయడానికి వస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను పిలిచి.. ఫ్యాన గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు ఇస్తామని ప్రలోభ పెట్టారు. కొందరికి అక్కడే నగదు ఇచ్చారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోలేదు.
తప్పని తిప్పలు
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రెండో రోజూ తిప్పలు తప్పలేదు. మొత్తం ఎనిమిది నియోజకవర్గాలలో నిర్లక్ష్యం కనిపించింది. నిబంధనల మేరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగాలి. కానీ కొన్ని చోట్ల 10 గంటలేనా అధికారులు, పోలింగ్ సిబ్బంది విధులకు రాలేదు. అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 9గంటలకు వచ్చారు. ఏర్పాట్లు కూడా అధ్వానంగా ఉండడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. మండుటెండలో మహిళలు అల్లాడిపోయారు. నీడ, నీరు ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వామా కార్యాలయానికి ఓటింగ్ కోసం ఉదయమే వచ్చినా.. ప్రారంభం కాలేదు. విధుల్లో ఉన్న అధికారులను అడిగితే.. ఎప్పుడు జాబితా వస్తుందో తమకే తెలియదని అన్నారు. దీంతో చాలామంది ఓటు వేయకుండానే వెనుదిరిగారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....