Share News

Fraud : స్వాహా సొమ్ము అంతేనా..!

ABN , Publish Date - Sep 27 , 2024 | 11:54 PM

మహిళల పొదుపు సొమ్మును వైసీపీ హయాంలో దిగమింగారు. ఐదేళ్లలో రూ.కోట్ల నిధులు స్వాహా చేశారు. అక్కాచెల్లెమ్మల సొమ్ముకు రక్షణగా నిలవాల్సిన డీఆర్‌డీఏ-వెలుగు ఉద్యోగులలో కొందరు ఈ అక్రమాలలో సూత్రధారులు, పాత్రధారులుగా మారారు. కళ్యాణదుర్గం, యాడికి, బుక్కరాయసముద్రం మండలాల్లో ఇటీవల వెలుగుచూసిన ఘటనలు వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు నిదర్శనం. లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడినవారిపై డీఆర్‌డీఏ-వెలుగు అధికారులు...

Fraud : స్వాహా సొమ్ము అంతేనా..!
Members of Self Help Women's Associations

పొదుపు మహిళల సొమ్ము దుర్వినియోగం

వైసీపీ హయాంలో రూ.25 కోట్ల వరకూ..

రికవరీపై దృష్టి పెట్టని ఉన్నతాధికారులు

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు27: మహిళల పొదుపు సొమ్మును వైసీపీ హయాంలో దిగమింగారు. ఐదేళ్లలో రూ.కోట్ల నిధులు స్వాహా చేశారు. అక్కాచెల్లెమ్మల సొమ్ముకు రక్షణగా నిలవాల్సిన డీఆర్‌డీఏ-వెలుగు ఉద్యోగులలో కొందరు ఈ అక్రమాలలో సూత్రధారులు, పాత్రధారులుగా మారారు. కళ్యాణదుర్గం, యాడికి, బుక్కరాయసముద్రం మండలాల్లో ఇటీవల వెలుగుచూసిన ఘటనలు వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు నిదర్శనం. లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడినవారిపై డీఆర్‌డీఏ-వెలుగు అధికారులు సస్పెన్షన వేటు వేసి చేతులు దులుపుకుంటున్నారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామైక్య, మండల సమాఖ్యల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నా.. బయటకు పొక్కడం లేదు. పక్కదారి పట్టిన సొమ్ములో క్షేత్రస్థాయి సిబ్బంది


నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు వాటాలుగా వెళ్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. గడిచిన ఐదేళ్లలో రూ.25 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు డీఆర్‌డీఏ-వైకేపీ రికార్డులు చెబుతున్నాయి. యానిమేటర్లు, బుక్‌ కీపర్లు, సీసీలు, ఏపీఎంలు, డీపీఎంలు, ఏసీలు.. ఇలా ఎవరి స్థాయిలో వారు నిధులను మాయం చేశారు. బ్యాంకు లింకేజీ, సీఐఎఫ్‌, ఉన్నతి, స్త్రీనిధి వంటి రుణాలను స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇస్తారు. ఈ సొమ్ము పక్కదారి పట్టినా.. వెలుగులోకి వస్తేనే విచారణ పేరిట హడావుడి చేస్తారు. ఆ తరువాత పట్టించుకోరన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు.

రూ.72 లక్షలు స్వాహా

కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లిలో మహిళలు తీసుకున్న రుణాలను తిరిగి సక్రమంగా చెల్లించేవారు. గతంలో డ్వాక్రాలో యానిమేటర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం బ్యాంకులో బిజినెస్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన స్థానంలో భార్య యానిమేటర్‌గా పనిచేస్తున్నారు. మహిళలు నెల నెలా సొమ్ము ఇచ్చి బ్యాంకులో కట్టాలని ఆయనను కోరేవారు. బ్యాంకులోనే పని చేస్తున్నాడని నమ్మి.. మహిళలు ప్రతి నెలా డబ్బులను అతని చేతిలో పెట్టారు. ఆయన వడ్డీ మాత్రమే జమచేసి.. మిగిలిన సొమ్మును వాడుకునేవాడు. చెల్లింపుల్లో ఒక్కనెల కట్టకపోయినా తేడాలొస్తాయి. నెలనెలా బ్యాంకు లింకేజీ సొమ్మును మండల సమాఖ్య అకౌంటెంట్‌ పరిశీలించాలి. సీసీలు, ఏపీఎంలు పర్యవేక్షించాలి. అయితే ఇక్కడ నాలుగేళ్ల నుంచి రుణంలోకి జమచేయకున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నది అనుమానాలకు తావిస్తోంది. ఈ బ్యాంకులోని 22 సంఘాల సభ్యులు చెల్లించిన రూ.72 లక్షలు స్వాహా చేసినట్లు తేలింది. పర్యవేక్షించాల్సిన అధికారులు కింది స్థాయి సిబ్బందిపై నెపం వేసి, తమకేమీ సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

ఐదేళ్లలో ఎన్నెనో..

- గార్లదిన్నె మండలం పెనకచెర్ల డ్యాం గ్రామానికి చెందిన స్వయం సహాయక మహిళా సంఘం రూ.5 లక్షల నిధులు బుక్‌కీపర్‌, యానిమేటరు, సీసీలు దుర్వినియోగం చేసినట్లు బాధిత మహిళా సభ్యులు పోలీ్‌సస్టేషనలో పిర్యాదు చేశారు.

- జిల్లాలో సామాజిక పెట్టుబడి నిధి సొమ్ము (సీఐఎఫ్‌) సుమారు రూ.12కోట్ల వరకు స్వాహా అయింది. అప్పట్లో డీఆర్‌డీఏ-వైకేపీ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీలకు చెల్లించే ఉన్నతి పథకంలోనూ రూ.5 కోట్ల వరకు నిధులు గోల్‌మాల్‌ అయ్యాయని సమాచారం. స్వయం సహాయక మహిళా సంఘాల జీవనోపాధుల పెంపునకు స్త్రీనిధి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రుణసదుపాయం పథకంలోనూ డీఆర్‌డీఏ-వైకేపీ ఉద్యోగులు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

- బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లిలో పొదుపుసంఘాల నిధులను స్వాహా చేశారని బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. సామాజిక తనిఖీలో పొదుపు సంఘాలు చెల్లించిన నగదు బ్యాంకులో జమచేయకుండా యానిమేటరు, సీసీ, ఏపీఎం, డీపీఎం, ఏసీలు వాటాలు పంచుకున్ననట్లు తేల్చారు. మొత్తం రూ.14 లక్షలు నిధులు దుర్వినియోగం కాగా.. రూ.8 లక్షలు వరకు రికవరీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓ మండలం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఓ మండలం, రాయదుర్గంలోనూ ఇదే పరిస్థితి. ఇలా స్త్రీనిధి సొమ్ము మాత్రమే జిల్లాలో రూ.5 కోట్ల వరకు స్వాహా అయింది.

రికవరీ చేస్తాం..

పొదుపు మహిళల నిధులను స్వాహా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సొమ్మును రికవరీ చేస్తాం. జిల్లాలో ఎక్కడైనా సరే పొదుపు మహిళల సొమ్ము జమలో తేడా వస్తే ఉపేక్షించేది లేదు. డీఆర్‌డీఏ-వైకేపీ పరిధిలో స్వయం సహాయక మహిళా సంఘాల నిధులకు రికార్డులు ఉంటాయి. నిధుల లెక్కల తేడాలపై జిల్లాలో అక్కడక్కడా ఫిర్యాదులు వస్తున్నాయి. లిఖితపూర్వకంగా వచ్చే ఫిర్యాదులపై కచ్చితంగా విచారణ చేపడుతాం. సిబ్బందితో పాటు పొదుపు సంఘాల మహిళలు కూడా బాధ్యతగా రికార్డులను చూసుకోవాలి. సభ్యులు రికార్డులను చూడడం మానేస్తేనే ఇలాంటి సమస్యలు వస్తాయి.

-ఓబులమ్మ, డీఆర్‌డీఏ-వెలుగు పీడీ

Updated Date - Sep 27 , 2024 | 11:57 PM