EDUCATION : రుచి మరిగిన ఎంఈఓ
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:58 PM
ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించింది. అన్ని విభాగాల్లో పీఠాలు కదిలినా.. విద్యాశాఖలో మాత్రం ఏడేళ్లు దాటినా అదే సీట్లలోనే తిష్టవేశారు. ఒకే చోట పాతుకుపోయు.. అక్రమ సంపాదనకు దిగుతున్నారు. ప్రతి పనికీ ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నుంచి నెలనెలా డబ్బులు ...
ఏడేళ్లుగా ఒకేచోట తిష్ట
ప్రైవేటు బడుల నుంచి వసూళ్లు
ఉన్నతాధికారుల అండతో అక్రమాలు
కళ్యాణదుర్గం, అక్టోబరు 1: ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించింది. అన్ని విభాగాల్లో పీఠాలు కదిలినా.. విద్యాశాఖలో మాత్రం ఏడేళ్లు దాటినా అదే సీట్లలోనే తిష్టవేశారు. ఒకే చోట పాతుకుపోయు.. అక్రమ సంపాదనకు దిగుతున్నారు. ప్రతి పనికీ ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నుంచి నెలనెలా డబ్బులు వసూలు చేసి రూ.లక్షలు వెనకేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులలో కొందరికి నెలనెలా వాటాలు సమర్పించుకుంటున్నారు. అందుకే ఎన్ని
ఫిర్యాదులు వెళ్లినా బుట్టదాఖలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
కారు కానుక
నియోజకవర్గ పరిధిలోని ఓ ఎంఈఓకు ప్రైవేట్ పాఠశాల అనుమతి కోసం ఏకంగా కారును కానుకగా సమర్పించారని ప్రచారం జరుగుతోంది. ఆ ఎంఈవో పరిధిలో సుమారు 20 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఏ ఒక్క పాఠశాలలోనూ నిబంధనలు అమలు కావు. ఫైర్, ట్రాఫిక్, ఆర్ అండ్ బీ నుంచి అనుమతులు ఉండవు. పాఠశాల మైదానం, మరుగుదొడ్లు, తాగునీరు.. ఇలా ఏవీ ఉండవు. అయినా దర్జాగా పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కో పాఠశాల నుంచి ఏటా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఎంఈఓకు వెళుతున్నాయని సమాచారం. నేరుగా డబ్బులు తీసుకోకుండా, మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు. అనంతపురంలోనే ముడుపులు తీసుకుని.. అక్కడే పని ముగించేస్తున్నారని సమాచారం. ఏడేళ్ల నుంచి ఓ ఎంఈవో ఇలా భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మార్సీకి ఏటా రూ.లక్ష వరకు నిధులు విడుదల అవుతాయి. బినామీలను ఏర్పాటు చేసుకుని, నకిలీ బిల్లులతో ఆ నిధులను స్వాహా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
కీచక ఉపాధ్యాయుడికి అండ
ఓ పాఠశాలలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి గురించి ఆ ఎంఈవో దృష్టికి వెళ్లింది. వైసీపీ నాయకులతో చేతులు కలిపి.. ఆ కీచక ఉపాధ్యాయుడిని ఎంఈఓ వెనకేసుకొచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిఫలంగా ఎంఈఓకు రూ.లక్ష ముట్టినట్లు సమాచారం. డబ్బులు తీసుకుని, దుప్పటి పంచాయితీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎంఈవోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు పలుమార్లు ఆందోళనలు చేశారు. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఆ ఎంఈవోపై ఈగ వాలలేదు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....