Share News

Alternative crops : పంట పండింది

ABN , Publish Date - Sep 24 , 2024 | 12:27 AM

దిగుబడితో పాటు ధర కూడా బాగుండటంతో ఈ ఏడాది సజ్జ పంట సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేరుశనగను సాగు చేసి నష్టపోయిన రైతులు సజ్జ పంట వైపు మెగ్గుచూపారు. గడిచిన పదేళ్ల నుంచి పత్తి, వేరుశనగ, ఆముదం పంటలను సాగుచేస్తూ రైతులు నష్టల చవిచూశారు. తెగుళ్లు సోకడం, వర్షాభావం వల్ల దిగుబడులు రానేలేదు. దీంతో రైతులు ఈ ఏడాది సంప్రదాయ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటలైన సజ్జ, కొర్ర, జొన్న పంటలను సాగు చేశారు. జక్కలచెరువు, తొండపాడు,...

Alternative crops : పంట పండింది
Korra crop

ఆదుకున్న ప్రత్యామ్నాయ పంటలు

మంచి దిగుబడి ఇచ్చిన సజ్జ, కొర్ర

ధర బాగుండటంతో రైతుల ఆనందం

గుత్తి రూరల్‌, సెప్టెంబరు 23: దిగుబడితో పాటు ధర కూడా బాగుండటంతో ఈ ఏడాది సజ్జ పంట సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేరుశనగను సాగు చేసి నష్టపోయిన రైతులు సజ్జ పంట వైపు మెగ్గుచూపారు. గడిచిన పదేళ్ల నుంచి పత్తి, వేరుశనగ, ఆముదం పంటలను సాగుచేస్తూ రైతులు నష్టల చవిచూశారు. తెగుళ్లు సోకడం, వర్షాభావం వల్ల దిగుబడులు రానేలేదు. దీంతో రైతులు ఈ ఏడాది సంప్రదాయ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటలైన సజ్జ, కొర్ర, జొన్న పంటలను సాగు చేశారు. జక్కలచెరువు, తొండపాడు, ఊబిచెర్ల, గొందిపల్లి, ఇసురాళ్లపల్లి, వన్నేదొడ్డి, అనగానిదొడ్డి, ఊటకల్లు, బేతాపల్లి తదితర గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు.

ఎకరాకు నాలుగు కిలోలు

మార్కెట్‌కు హైబ్రీడ్‌ సజ్జ, కొర్ర విత్తనాలు రావడంతో రైతులు వాటి పట్ల మొగ్గుచూపారు. ఎకరానికి 4 కేజీల విత్తనాలు విత్తారు. వేసిన 15 రోజుల నుంచి 20 రోజులకు గడ్డి తొలగించేందుకు సేద్యం చేశామన్నారు. తక్కువ నీటి అవసరం,


బెట్టను తట్టుకునే స్వభావం ఉండటంతోపాటు 60 రోజుల్లోనే దిగుబడి వస్తుండటంతో పలువురు రైతులు సజ్జ పంటను సాగు చేస్తున్నారు. కొందరు రైతులు కందిలో అంతర పంటగా సాగు చేశారు. రైతులు ఆశించినట్లుగానే పంట దిగుబడులు వచ్చాయి. ఎకరాకు ఏడు నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి రావడంతో తమ కష్టం ఫలించిందని పలువురి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మార్కెట్‌లో క్వింటా రూ.2200 నుంచి 2500 వరకు ఉండటం రైతులకు కలిసి వస్తోంది. కొర్ర పంట కూడా ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది ముందుగా వర్షాలు రావడంతో జూన చివర, జూలై మొదటి వారంలో విత్తనం విత్తారు. ముందుగా సాగైన పంటలకు 60 రోజులు పూర్తి కావడంతో రైతులు పొలాల్లో పంటలను తొలగిస్తున్నారు. కంకులను వేరు చేస్తున్నారు. ఇతర పంటలతో పోల్చితే సజ్జ, కొర్ర పంటలకు విత్తనాలు, కూలీలు, రసాయన మందులు ఖర్చు తక్కువని రైతులు చెబుతున్నారు.

సజ్జ పంట ఆదుకుంది

సజ్జ పంటను ఏడు ఎకరాల్లో సాగు చేశా. తొలుత కంది వేసి వాటిలో అంతర పంటగా సజ్జ వేశా. రెండు నెలలకు సజ్జ కాపు చేతికి అందింది. ప్రస్తుతం కంకులను కోస్తున్నాము. వాటిని మెషీనకి వేయాలి. మరో మూడు ఎకరాలో వేరుశనగ పంట సాగు చేశా.

- రైతు నాగార్జున, తొండపాడు

పంట కోతకు వచ్చింది

నేను మూడు ఎకరాల్లో సజ్జ పంట సాగు చేశా. ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది సజ్జ పంట బాగా పండింది. త్వరలో కంకులను వేరుచేసి పంటను తొలగిస్తాను. కొంత మంది రైతులు పంటను తొలగించారు.

- నాగేంద్ర, ఊటకల్లు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 24 , 2024 | 12:27 AM